ఈతకెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి

Apr 22,2024 00:51

ప్రజాశక్తి – నాదెండ్ల : ఈతకని వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటన మండలంలోని తూబాడులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షేక్‌ సిద్ధిక్‌ (12), షేక్‌ అక్తర్‌ (12) స్థానిక జెడ్‌పి పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేశారు. తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్‌ నుండి నీటిని కాల్వలకు విడుదల చేసిన విషయం తెలిసిందే. వేసవి సెలవులు కావడంతో కాల్వలో ఈతకొట్టడానికని వీరిద్దరూ ఆదివారం తూబాబు-చిరుమామిళ్ల మధ్య ఉన్న పెదనందిపాడు బ్రాంచ్‌ కెనాల్‌కు మధ్యాహ్నం వెళ్లారు. ఈత కొడుతుండగా నీటి ఉధృతికి ఇద్దరూ కొట్టుకుపోయారు. వీరితోపాటు ఉన్న మరో వ్యక్తి ఇది గమనించి కాపాడే ప్రయత్నం చేసినా చాలా సేపటి వరకూ రక్షించలేకపోయారు. కొద్దిసేపటికి అతికష్టం మీద ఒడ్డుకు చేర్చి హుటాహుటిన ఆటోలో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

➡️