విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు బలి

ప్రజాశక్తి-ఒంటిమిట్ట విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు బలి అయ్యారు. రెండు రోజుల నుంచి విద్యుత్‌ హై వోల్టేజ్‌ వస్తున్నా నిర్లక్ష్యం వహించడంతో రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సిపిఎం మండల కార్యదర్శి కోనేటి నరసయ్య తల్లి తన ఇంటిలో ఫ్రిడ్జ్‌డోర్‌ తీస్తుండగా విద్యుత్‌షాక్‌ గురయ్యారు. ఆమెను కాపాడబోయి మరొకరు విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ విషాధకర సంఘటన మండల పరిధిలోని ఇబ్రహీంపేట ఎస్‌సి కాలనీలో చోటు చేసుకుంది. వివరాలు.. ఇబ్రహీంపేటకు చెందిన కోనేటి గంగమ్మ (65) మంగళవారం తన ఇంటిలోని ఫ్రిజ్డ్‌ను తెరిచేందుకు ప్రయత్నించగా విద్యుత్‌ షాక్‌ కొట్టడంతో ఆమె గట్టిగా అరిచింది. ఆసమయంలో అక్కడే ఉన్న కొండయ్య (51) అనే వ్యక్తి ఆమెను కాపాడబోయి తాను విద్యుత్‌షాక్‌ గురయ్యాడు. ఈ సంఘటనలో గంగమ్మ అక్కడికక్కడే మృచెందింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కొండయ్యను స్థానికులు 108 వాహన సాయంతో ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అప్పటికే అతనూ మృతిచెందాడు. వారిద్దరి మృతితో రెండు కుటుంబాల్లో విషాధచాయలు అలుముకున్నాయి. కాగా మృతుడు కొండయ్య వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కొండయ్య మృతితో అతని కుటుంబం వీధిన పడింది. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమే.. ఇబ్రహీంపేట గ్రామంలో తరచూ విద్యుత్‌ సరఫరాలో లో, హై ఓల్టేజీ సమస్య ఉందని స్థానికులు పేర్కొన్నారు. విద్యుత్‌శాఖాధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేని వాపోయారు. అధికారుల నిర్లక్ష్యంతోనే రెండు ప్రాణాలు పోయాయని ఆరోపిస్తున్నారు. గతంలో లో, హై ఓల్టేజీ సమస్యతో ఇళ్లల్లోని విద్యుత్‌ పరికరాలు కాలిపోయాయని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో నెలకొన్న సమస్యను పరిష్కరించి భవిష్యత్‌లో ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడాలని కోరారు. మృతుల కుటుంబానికి రూ. 25 లక్షలు చెల్లించాలి : సిపిఎం కడప అర్బన్‌ : ఒంటిమిట్ట మండలం పరిధిలోని ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన కోనేటి గంగమ్మ (65) పేరూరు కొండయ్య (51) విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి ఇళ్లకు అధిక విద్యుత్‌ రావడం వల్ల ఇద్దరు నిండు ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్‌ అధికారులు బాధ్యత వహించి వారికి కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌, జిల్లా కమిటీ సభ్యులు అన్వేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఇద్దరి మృతదేహాలను రిమ్స్‌లో సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్‌ అధికారులు నిర్లక్ష్యం వల్ల హై వోల్టేజ్‌ రావడం కోనేటి గంగమ్మ ఇంటిలో ఫ్రిడ్జ్‌ తీస్తుండగా విద్యుత్‌ షాక్‌ కొట్టి అక్కడ అక్కడే మతి చెందిందని పేర్కొన్నారు. ఆమెను కాపాడబోయి పేరూరు కొండయ్య మతి చెందారని తెలిపారు. దీనికి పూర్తి బాధ్యత విద్యుత్‌ ఉన్నత అధికారులు ఎఇ, ఎడి, డిఇలు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఒంటిమిట్ట మండలం సిపిఎం మండల కార్యదర్శి కోనేటి నరసయ్య తల్లి కోనేటి గంగమ్మ , పేరూరు కొండయ్య మతులను పరిశీలించారు. సిపిఎం మండల కార్యదర్శి నరసయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో సిద్దవటం సిపిఎం మండల కన్వీనర్‌ సురేష్‌ బాబు పాల్గొన్నారు.

➡️