ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్ : జగన్నాథపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, టీకా కార్యక్రమాన్ని వైద్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో స్కానింగ్ కోసం సమీప గిరిజన గ్రామాల నుంచి వచ్చిన గర్భిణులతో మాట్లాడారు. ఆరోగ్య తనిఖీ వివరాలు ఎంసిపి కార్డులో పరిశీలించారు. కాన్పు తేదీలపై గర్భిణులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. గైనకాలజిస్ట్ జి.నిహారిక గర్భిణులకు యుపిహెచ్‌సిలో స్కానింగ్ నిర్వహించారు. ప్రతి రోజూ ఆరోగ్య కేంద్రానికి తనిఖీల కోసం ఎంత మంది వస్తున్నారని ఒపి రికార్డులో ఆయన పరిశీలించారు. వ్యాక్సిన్, మందుల లభ్యతపై అడిగి తెలుసుకున్నారు. లెప్రసీ, ఎన్‌సిడి సర్వేలు, అంగన్వాడీ, స్కూల్ హెల్త్ స్క్రీనింగ్ గురించి అడిగి గుర్తించిన ఆరోగ్య సమస్యలపై దృష్టిసారించి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. అనంతరం కొత్తవలస 7, 8 వార్డులో సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని డాక్టర్ జగన్మోహన్ పరిశీలించారు. ఎంతమంది పిల్లలకు టీకాలు వేశారు, టీకా వివరాలు, ఆర్‌సిహెచ్ రికార్డులో పరిశీలించారు. మొబైల్‌లో యూవిన్ పోర్టల్ పరిశీలించి వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తకుండా నవజాత శిశు ఆరోగ్యాన్ని పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. గర్భిణీ, శిశు ఆరోగ్య సూచనలకు సంబంధించి పోస్టర్లను టీకా కేంద్రంలో ప్రదర్శించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ఎంజిఎం చాంద్, సూపర్‌వైజర్లు సత్తిబాబు, ఇందిర, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
