ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : పట్టణ ప్రధాన రహదారిలో ఏర్పడిన గోతులను కప్పి మరమ్మతులు చేపట్టాలని రోడ్లు, భవనాలశాఖ డిప్యూటీ డిఇ టి.నిర్మలకు సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఇందిర, కమిటీ సభ్యులు పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన రహదారిలో సిపిఎం బృందం పర్యటించి పరిశీలించింది. ఇందులో భాగంగా కొత్తవలస రైల్వేపై వంతెనపై, బైపాస్, రాయఘడ రోడ్లు, హనుమాన్ జంక్షన్, డంపింగ్ యార్డ్ వద్ద, ప్రధాన రహదారుల్లో గుంతలు, గొయ్యిలు ఏర్పడ్డాయని, దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వీటి మరమ్మతు పనులు చేయించాలని కోరారు. స్పందించిన డిఇ ప్రధాన రహదారిలో మరమ్మతు పనుల నిమిత్తం టెండర్ దశలో ఉందని, టెండర్ ఖరారైన వెంటనే మరమ్మతు పనులు చేపడతామని తెలిపారు.