సాగుకు తప్పని జాప్యం!

Jun 10,2024 23:50

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : నైరుతీ రుతుపవనాల ప్రభావం వల్ల గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈనెల ఒకటో తేదీ నుంచి రెండు జిల్లాల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాగా ఇప్పటి వరకు వర్షపాతం కొంత మేరకు ఆశాజనకంగా ఉంది. ఈనెల 10వ తేదీ వరకు గుంటూరు సగటుగా కురవాల్సిన వర్షపాతం 32.4 మిల్లీ మీటర్లు కాగా కురిసిన సగటు వర్షపాతం 50.3 మిల్లీ మీటర్లుగా నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలోని 6 మండలాల్లో నిర్ణీత వర్షపాతం కంటే ఎక్కువ నమోదైందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలో 10 రోజుల్లో సగటు కురవాల్సిన వర్షపాతం 27 మిల్లీ మీటర్లు కాగా ఇప్పటి వరకు జిల్లాలో కురిసిన సగటు వర్షపాతం 52.7 మిల్లీ మీటర్లుగా నమోదైంది. పల్నాడు జిల్లాలో 9 మండలాల్లో అవసరానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతీ కొంత మేరకు ఆశాజనకంగా ఉన్నట్టు కన్పిస్తున్నా జలాశయాల్లో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉండటంతో ఖరీఫ్‌ సాగు ప్రారంభంలో కొంత జాప్యం తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా డెల్టా కాల్వలకు పులిచింతల నుంచి ఇప్పట్లో నీరు విడుదల అయ్యే అవకాశం లేదు. పులిచింతల జలాశయం గరిష్ట నీటి వల్ల 45.77 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రంకు 0.75 టీఎంసిలే నీటినిల్వ ఉంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం రాకపోవడం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాలు పూర్తిగా దిగువ స్థాయికి పడిపోయాయి. ప్రధానంగా శ్రీశైలంలో గరిష్ట నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రంకు 33.72 టీఎంసీలు మాత్రమే ఉంది. నాగార్జున సాగర్‌లో గరిష్ట నీటినిల్వ 312.01 టీఎంసీలుకాగా ప్రస్తుతం 122.69 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. మొత్తంగా ప్రధాన జలాశయాల్లో కనీస నీటి నిల్వలు లేకుండా పోతున్నాయి. నాగార్జున సాగర్‌, శ్రీశైలంలో నీటి నిల్వ డెడ్‌ స్టోరేజికి చేరుకున్నాయి. పులిచింతలలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. డెల్టాలో సాగుకు పులిచింతల నుంచి నీటిని వినియోగించే అవకాశం లేకపోవడంతో వచ్చేనెల మొదటి వారంలో పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు లేకుండా సాగుపై రైతులు ముందడుగు వేయలేకపోతున్నారు. గుంటూరు జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో, పల్నాడు జిల్లాలో ఏడు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ముందస్తు ఖరీఫ్‌ సాగు జరుగుతోంది. కురిసిన వర్షాలతో ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారు. నువ్వులు, పెసర, మినుము, జ్యూట్‌, జనుము, పిల్లిపెసర తదితర పంటలను సాగు చేస్తున్నారు. రెండు జిల్లాలో ప్రస్తుతం రైతులు భూములను దుక్కి దున్నీ సేద్యానికి సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఏరువాక పౌర్ణమి నుంచి వ్యవసాయ పనులకు పూర్తిస్థాయిలో శ్రీకారం చుడతారని అధికారులు భావిస్తున్నారు.

➡️