శ్రీవారి సేవలో కేంద్రమంత్రి బండి సంజయ్
ప్రజాశక్తి – తిరుమల : శ్రీవారి ఆస్తులను కాజేసిన నయవంచకులను జనం తరిమికొట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ…ఎపిలో గత ప్రభుత్వ పాలకులు వీరప్పన్ వారసులని, వారు ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఈ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారన్నారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేది లేదన్నారు. శ్రీవారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. త్వరలోనే వారికి శిక్ష పడుతుందన్నారు.
18న ఆన్‌లైన్‌లో సేవా టికెట్లు
ఈ నెల 18 నుంచి అక్టోబర్ నెల దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టిటిడి ఓ ప్రకటనలో పేర్కొంది. నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్నప్రసాద సముదాయంలో యంత్రాల ఆధునికీకరణ, ఉద్యోగుల సంఖ్యను పెంచుతామన్నారు. తిరుమలలో రద్దీ సాధారణంగా నెలకొందని, 14 కంపార్టుమెంట్లలో యాత్రికులు వేచి ఉన్నారని పేర్కొంది. టోకెన్ లేని యాత్రికులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోందని తెలిపింది. బుధవారం శ్రీవారిని 73, 353 మంది దర్శించుకోగా..28, 444 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లుగా నమోదు అయింది.