ప్రజాశక్తి – కడప ప్రతినిధి’రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు పెంచబోం’. ఇది 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు ఇచ్చి హామీ. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలో విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేయడం ప్రజలను నిశ్చేష్టులను చేస్తోంది. విద్యుత్ ఛార్జీలను పెంచడానికి అనువైన శీతాకాలాన్ని ఎంచుకుని తన బాదుడే.. బాదుడు కార్యక్రమం తరహాలో విద్యుత్ ఛార్జీలను బాదేస్తోంది. ఉదాహరణకు కడప కార్పొరేషన్ కాంప్లెక్స్‌లోని 211410106639 విద్యుత్ కనెక్షన్ కలిగిన గదికి డిసెంబర్ బిల్లును పరిశీలిస్తే ఆశ్చర్య పోవాల్సి వచ్చింది. సదరు గది నిర్వాహకులు రోజుకు రెండు నుంచి మూ డు గంటలు మాత్రమే గదిలో ఉంటారు. డిసెంబర్‌లో 17 యూ నిట్లు మాత్రమే వినియోగించారు. బిల్లును పరిశీలిస్తే రూ.339 ఛార్జీతో గుండె గుబిల్లుంది. ఎనర్జీ ఛార్జి కింద రూ.91, ఫిక్స్‌డ్ ఛార్జీ కింద రూ.150, కస్టమర్ ఛార్జీ కింద రూ.30, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కింద రూ.17, సర్‌ఛార్జి కింద రూ.25, ట్రూ అప్ ఛార్జీ కింద రూ.18.72 చొప్పున సుమారు ఆరు రకాల అదనపు ఛార్జీల ను కలిపి తడిసి మోపెడు బిల్లు రావడం ఆందోళన కలిగిం చింది. ఈలెక్కన యూనిట్‌కు రూ.22 పైగా పడినట్లు తెలుస్తోంది. కడప నగరంలోని పటేల్ రోడ్డులోని 2114101145 032 నెంబరు విద్యుత్ కనెక్షన్ కలిగిన ఇంటికి ఇదేతరహాలో బిల్లు రావడం ఆందోళన కలిగించింది. డిసెంబర్ మాసంలో 54 యూనిట్లు వినియోగించారు. 54 యూనిట్లకు సంబంధించి రూ.561 బిల్లు వచ్చింది. ఈలెక్కన యూనిట్‌కు రూ.10 పైగా చెల్లించాల్సి దుస్థితి రావడం విస్మయాన్ని కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి తరహాలో విద్యుత్ ఛార్జీల బిల్లుల మాయాజాలం కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఇష్టారీతన 2022 ఏప్రిల్ నుంచి బిల్లుల మోత మోగించడం పట్ల సర్వత్రా విమర్శలకు ఆస్కారాన్ని కలిగిస్తోంది.రూ.100 పెరగడం ఆందోళనకరం నవంబర్‌లో 78 యూనిట్ల వినియోగానికి రూ.934 వచ్చింది. డిసెంబర్‌లో 66 యూనిట్ల వినియోగానికి రూ.945 వచ్చింది. కరెంటు వినియోగం తగ్గినప్పటికీ రూ.100 వరకు పెరి గింది. అదనపు కరెంటు ఛార్జీలను తగ్గిస్తే ఉపశమనం కలుగుతుంది.- జి.సురేష్‌బాబు, రాజారెడ్డివీధి, కడప. ఛార్జీల పెంపును ఉపసంహరించాలి కరెంటు ఛార్జీల పెంపును ఉప సంహరించుకోవాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో రూ.200 అధికంగా బిల్లు రావడం ఆందోళన కలిగించింది. శీతా కాలంలో వినియోగం తక్కువగా ఉన్నప్పుడే ఇంత పెరుగుదల ఉంటే వేసవి సీజన్‌లో కరెంటు బిల్లుల చెల్లింపు భారం భరించడం కష్టమే. – మల్లికార్జునరెడ్డి, నాగరాజుపేట, కడప. కరెంటు ఛార్జీలను భరించలేకున్నావిద్యుత్ బిల్లు పెరుగుదల భరించలేకున్నా. నవంబర్ నెలలో రూ.1717 బిల్లు వచ్చింది. దుకాణాన్ని వారం రోజులు మూసేయాల్సి వచ్చింది. అప్పు చేసి బిల్లు చెల్లించాల్సి వచ్చింది.- వై.చెండ్రాయుడు, మట్టిపెద్దపులివీధి, కడప.
