ప్రజాశక్తి-నాయుడుపేట (తిరుపతి) : తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ప్రభుత్వ భూమి రోజురోజుకీ కనుమరుగైపోతున్నాయి. అధికారులు స్పందించకపోవడంతో ఎవరిష్టానికి వారు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించిన వారిలో ఏమాత్రం చలనం రావడం లేదు. ఇదే అవకాశంగా అక్రమణదారులు మరింత రెచ్చిపోతున్నారు. ఇక్కడ మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్ అండ్ బి శాఖ అధికారుల గురించి. ఆర్ అండ్ బి శాఖ వారి తీరే వేరు అన్నటుగా ఉంది. ఆ శాఖ అధికారులు విధాన శైలి ఈ శాఖకు సంబంధించిన పట్టణంలోని ప్రధానాధికారులైన డి ఈ పరమేశ్వరి, జె ఈ చెన్నరాయుడు లకు పాపం వారి భూములు ఎక్కడున్నాయో కూడా వారికి తెలిసినట్టుగా లేదు వీరి ఉదార స్వభావానికి ముగ్ధులైన కొంతమంది వ్యాపారస్తులు ఇష్టానుసారంగా ఆర్ అండ్ బి స్థలాలను ఆక్రమించుకుని వాటిని అద్దెలకి ఇచ్చేసి రద్దీగా ఉన్నచోట రోడ్డుకు అడ్డంగా వ్యాపారాలు చేయిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు.ఇలాంటి దారుణమైన పరిస్థితులను ఫోటోలు తీసి వారిముందుంచి ప్రజల ప్రాణ రక్షణకై రోడ్డు పక్కనున్న ఆర్ అండ్ బి స్థలాలను ఆక్రమించుకుని ప్రమాదాలు కలిగించేలా వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు విన్నవించిన వారిలో ఏమాత్రం చలనం కలగకపోవడం ఆశ్చర్యం.ఈ శాఖకు సంబంధించిన భూములు అన్యాకాంతమైపోతున్నాయని వివరాలతో సహా పత్రికల్లో పలుమార్లు కథనాలు రాసిన పై అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో ఈ శాఖ తీరు పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.రెండు సంవత్సరాల ముందు నాయుడుపేట నుంచి చెన్నైకి వెళ్లే దారిలో ట్రినిటీ హాస్పిటల్ ముందు రైల్వే బ్రిడ్జిపై వీళ్ళు నిర్మించిన రోడ్డు అత్యంత ప్రమాదంగా మారింది. ఆ రోడ్డు చూస్తే రోడ్లు భవనముల శాకేనా అనే అనుమానాలు కలుగక మానవు.పి వి ఎస్ హాస్పిటల్ నుంచి ట్రినిటీ హాస్పిటల్ మధ్యలో కొయ్యల మిల్లుల యజమానులు వారి మిల్లుల ముందున్న ఆర్ అండ్ బి స్థలాన్ని ఆక్రమించుకుని మిల్లులో కలిపేసుకోవటమే కాకుండా రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని కూడా ఆక్రమించుకుని నర్సరీలకు,మరి కొన్ని షాపులకు అద్దెలకిచ్చి వీరి ధనార్జన కోసం రోడ్డుకు అడ్డంగా వ్యాపారాలు చేయిస్తూ ఎన్నో ప్రమాదాలు కారకులవుతున్నారు ఇలాంటివి ఎన్నో ఆక్రములు బహిరంగంగా కనిపిస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒక పేదవాడు ఊరికి దూరంగా ఎక్కడో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో నీడ కోసం చిన్న పాక వేసుకుంటేనే అధికారులందరూ ఒక్కటిగా కలసి ఒక పేద వాడి గూడును క్షణాల్లో తీయిస్తారు. అలాంటిది ఉన్నవాడు మాత్రం బహిరంగ ప్రదేశాలను ఆక్రమించుకున్న దాని వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది వ్యతిరేకిస్తున్న అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంలో అంతర్యం ఏమిటో ఉన్నవారిపై మాత్రమే అధికారులకు ఇంతటి ఉదారత ఎందుకు చూపిస్తున్నారో వాళ్లే వివరించాలి. చెన్నై, విజయవాడ, నెల్లూరు ల నుంచి వచ్చే భారీ వాహనాలకు,ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఇదే ప్రధాన రహదారి నాయుడుపేటకు చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే ఆటోలు ద్విచక్ర వాహనాలతో నిత్యం అత్యంత రద్దీగా ఉండే రోడ్డు అటువంటి రోడ్డుపై పూల చెట్లు,పరుపులు,కుర్చీలు ఇలాంటివి కొనడానికి ఆ షాపుల ముందు రోడ్డుపై కార్లు ఆటోలు బైకులు ఆపేసి ప్రమాదాలు సఅష్టిస్తున్నారు.ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు పోతున్న ఆర్ అండ్ బి అధికారులు ఏమాత్రం చెల్లించటం లేదు ఓ పక్క ప్రజల ప్రాణాలు మరోపక్క ప్రభుత్వ భూములు అక్రమదారుల ధన దాహానికి ఆవిరైపోతుంటే ఆర్ అండ్ బి అధికారులు వారికి వంత పాడుతూ జేబులు నింపుకుంటూ వేడుక చూస్తున్నారు.పోతే జరుగుతున్న కబ్జాలపై ఆర్ అండ్ బి అధికారులను పలుమార్లు వివరణ కోరగా గత రెండు సంవత్సరాల నుంచి వారు చెబుతున్న సమాధానం ఒక్కటే తహసిల్దార్ కి లేఖ రాశాం సర్వేయర్ ని పంపిస్తామన్నాడు, మునిసిపాలిటీ వారు మాకు సహకరించటం లేదు అంటూ ఏదో ఒక శాఖపై తోసేసి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప సరైన సమాధానం ఇవ్వడం లేదు.వీరి స్వలాభం కోసం సంబంధంలేని కారణాలతో రోజులు గడుపుతున్నారే గాని ప్రజల ప్రాణాలకు విలువివ్వటం లేదన్నది కనిపిస్తున్న వాస్తవం.ఇప్పటికైనా పై అధికారులు రాజకీయ నాయకులు స్పందించి ప్రజల ప్రాణాలను,ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
