నిలకడ లేని ధరలతో ఉల్లి రైతులు విలవిల

ప్రజాశక్తి-చాపాడు ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజలకు కన్నీటిని తెప్పిస్తున్న ఉల్లి ధరలు అటు సాగు చేస్తున్న రైతులకు కూడా ఇబ్బందికరంగానే మారాయి. అడఫాధడప వర్షాల కారణంగా సాగుచేసిన పంట దెబ్బతినడంతో ఒకటికి రెండుసార్లు సాగు ఖర్చులు రైతు మీద పడుతున్నాయి. గతంలో 100 కిలోల విత్తనాల ధర రూ.45 నుంచి రూ.50 వేల లోపు మాత్రమే. ఈ ఏడాది విత్తనాల ధర రూ.65 వేలకు చేరుకొని రైతులకు ఆర్థిక భారమైంది. ఎకర సాగుకు ఖర్చు రూ.50 వేలు అవుతుండడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జూన్‌, జులై నెలల్లో రూ.65 వేలు వెచ్చించి విత్తనాలు సేకరించి రైతులు సాగు చేపట్టారు. వర్షం సరిగా పడకపోవడంతో సాగు దెబ్బతన్నది. వర్షాలు లేక పంట దెబ్బతిని ఆర్థికంగా నష్టం ఏర్పడినప్పటికీ తిరిగి సాగుకు యత్నం చేపట్టారు.ఈ ఏడాది ధరలు సెప్టెంబర్‌ నెలలో క్వింటాలు రూ.3500 వరకు పలికాయి. ప్రస్తుతం క్వింటా 2800 వరకు మాత్రమే ధరలు పలుకుతున్నాయి. జిల్లాలో దువ్వూరు, మైదుకూరు, చాపాడు, ఖాజీపేట, తదితర ప్రాంతాల్లో నాలుగు వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రైతులు కర్ణాటక ప్రాంతంలోని చిక్బలాపూర్‌, గోర్‌ బెద్దనూర్‌, నంద్యాల నుంచి విత్తనాలను సేకరించి సాగు చేపట్టారు. ప్రస్తుతం కర్ణాటక రకం క్వింటాల్‌ రూ.2800 వరకు పలుకుతున్నాయి. క్వింటాల్‌ రూ.6 వేల నుంచి రూ.8 వేల గిట్టుబాటు ధరలు ఉంటే రైతులు సాగు ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. దళారులు రోజుకో రేటును నిర్ణయిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు తాడేపల్లిగూడెం, మద్రాస్‌ మార్కెట్లో ప్రస్తుతం క్వింటాలు రూ.40 వేలకు పైగా ధరలు పలుకుతుంటే మన ప్రాంతంలో మాత్రం రూ.3 వేలు లోపు మాత్రమే రైతులకు చెల్లిస్తున్నారు. అది కూడా వర్షం వచ్చినప్పుడు అమ్మకాలు చేపడితే ధరలు మరింత తగ్గిస్తున్నారు. మైదుకూరు ప్రాంతంలో శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే సాగు మరింత పెరిగి రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఎన్నో ఏళ్లుగా రైతులు ఉల్లి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు. మార్కెట్లో మాత్రం ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.ఎకరాకు రూ.50 వేల వరకూ ఖర్చులు రెండు ఎకరాలలో ఉల్లి పంటను సాగు చేశా. నంద్యాల ప్రాంతంలో విత్తనాలను సేకరించి సాగు చేపట్టాం. ప్రస్తుతం పంట నూర్పిడి దశలో ఉంది. ధరలు చూస్తే అమాంతం తగ్గిపోతున్నాయి. ఎకరాకు రూ.50 వేల వరకు సాగు ఖర్చులు అయ్యాయి. శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధరలు నిలకడగా ఉండేలా చూడాలి.- ప్రసాద్‌, రైతు, సిద్దారెడ్డిపల్లె, చాపాడు మండలం. గిట్టుబాటు ధరలు నిర్ణయిస్తే ఉపయోగం ఉల్లి పంటకు సరైన గిట్టుబాటు ధరను నిర్ణయించకపోవడంతో దళారులు సూచించిన ధరలకు అమ్మకాలు చేయాల్సివస్తుంది. ప్రతి సంవత్సరం ఉల్లి పంటను సాగు చేసి తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సాగు చేసే సమయంలో ధరలు ఒక మాదిరిగా దేవుడు వచ్చిన తర్వాత ధరలు వేరుగా ఉంటున్నాయి. ఇతర ప్రాంతాల్లో ధరలు అధికంగా ఉన్న మైదుకూరులో వ్యాపారులు తక్కువ కొనుగోలు చేస్తున్నారు. శాశ్వత కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. – వీరయ్య, రైతు, మైదుకూరు.

➡️