అకాల వర్షాలతో ఉప్పు పంటకు ముప్పు

అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఉప్పు మడులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం

అకాల వర్షాలతో ఉప్పు పంటకు ముప్పు ఏర్పడింది. మండుటెండల వల్ల ఉప్పు అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుందని భావించిన ఉప్పు రైతులను అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. మండలంలో పూడిమడకలో శ్రీశ్రీనివాస సాల్ట్‌ పాన్‌ వర్కర్స్‌ ఆధ్వర్యంలో 25 ఎకరాల విస్తీర్ణంలో 50 మంది రైతులు ప్రతి సంవత్సరం ఉప్పు పంట పండించి దానిపై వచ్చే ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. నాగుల చవితి తర్వాత నుంచి ఉప్పుమడులు పనులు చేపడతారు. ఉప్పు తయారీకి ముందుగా గట్లు వేయడం, నేల చదును చేయడం తదితర పనులు చేయాల్సి ఉంటుంది. ఉప్పు పండించడానికి సముద్రతీరంలో ఉన్న ఇసుకతో పనులు చేపడుతారు. ప్రభుత్వ ఆంక్షలు కారణంగా తీరం వద్దనున్న ఇసుకను తీసుకోవడానికి అధికారులు ఆటంకం కల్పిస్తున్నారు. ప్రస్తుత రోజులలో టన్ను ఇసుక వేలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేక మట్టి పైనే పంట పండించడం ప్రారంభిస్తున్నారు. వారి కష్టార్జితంతో నేలను చదును చేసి, గట్లు పరిపుష్టతగా వేయడం వంటి పనులు చేశారు. సంక్రాంతి వరకు వాతావరణం అతి శీతలంగా మంచు కారణంగా ఆశించిన రీతిలో ఉప్పు పంట చేతికి రావడం లేదని ఉప్పు రైతులు చెబుతున్నారు. ఫిబ్రవరి నెల నుంచి ఉప్పు పంట రావడం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలలో ఎంత గట్టిగా ఎండలు కాస్తే అంత లాభసాటిగా ఉంటుందని రైతులు తెలిపారు. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉప్పుమడులు బురదమయంగా మారాయి. గట్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. దాని కారణంగా ఉప్పు పంట పండడానికి ఆటంకం ఏర్పడింది. పండించిన ఉప్పు గట్లపై నుంచి ప్లాట్‌ఫారంకు మోసి కుప్పలుగా వేస్తున్నారు. వర్షానికి కరిగిపోకుండా వాటిపై తార్ఫలిన్లు వేసి రక్షణ కల్పిస్తున్నారు. పెరిగిన డీజిల్‌ ధరలతో ఉప్పు టేరులో బడులలోకి ఇంజిన్‌ ద్వారా తరలించడానికి అధిక మొత్తంలో ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. ఖర్చులన్నీ పోయి చేతికి వచ్చిన డబ్బులతో సంవత్సరం కాలం జీవించాలని రైతులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఉప్పు రైతులకు ఆర్థిక సహాయం చేయాలని, డీజిల్‌ పై సబ్సిడీ ఇప్పించాలని కోరుతున్నారు. ఉప్పు మడులకు గట్లు వేయుట, నేల చదురు చేయుట వంటి పనులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టి ఉప్పు రైతులను, కూలీలను ఆదుకోవాలని కోరుతున్నారు. పండించిన ఉప్పు భద్రపరచుకోవడానికి షెడ్లు కట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

➡️