విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

Jun 11,2024 21:42

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ఖరీఫ్‌ సాగుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వరి, వాణిజ్య పంటల విత్తనాలను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌ పాల్‌ కోరారు. మండలంలోని మారుమూల ప్రాంతమైన రాయగడ జమ్ములో గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై వరి, పచ్చిరొట్ట విత్తనాలు, చిరుధాన్యాలు గిరిజన రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు రాయితీలు సద్వినియోగం చేసుకొని పంటలు పండించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. 2024 ఖరీఫ్‌ వ్యవసాయ ప్రణాళిక రైతులకు వివరించారు. ఖరీఫ్‌లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పత్తి విత్తనాలను అనధికారికంగా ఎవరూ కొనుగోలు చేయొద్దని సూచించారు. రైతు భరోసా కేంద్రంలో నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచి పత్తిక అమల, ఎంఇఒ సిహెచ్‌ ప్రసాదరావు తదితరులు ఉన్నారు.జియ్యమ్మవలస : రైతు భరోసా కేంద్రాల్లో వరి విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కురుపాం నియోజకవర్గ తెలుగు రైతు సంఘం అధ్యక్షులు గురాన శ్రీరామమూర్తి నాయుడు పిలుపునిచ్చారు. మండలంలోని పెదబుడ్డిడిలో ఆర్‌బికెలో వరి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంటియు 1064, ఎంటియు 1121, ఎంటియు 1061, ఆర్‌జెఎల్‌, సాంబ మసూరి లాంటి నాణ్యమైన వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పెదబుడ్డిడి సర్పంచ్‌ సీమల సుజాత, ఎంపిటిసి సభ్యులు రేవల్ల జ్యోతి రైతులతో కలిసి వరి విత్తనాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో కర్రి గోవింద నాయుడు, సత్యనారాయణ, విఎఎ పవన్‌, రైతులు పాల్గొన్నారు.కురుపాం : ఖరీఫ్‌ సీజన్లో రైతులకు రాయితీపై వరి విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు ఎఒ నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ముందస్తు ప్రణాళికతో ఆర్‌బికె కేంద్రాల్లో అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచామన్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై వరి విత్తనాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వరితో పాటు వేరుశనగ, చోడి, ఇతర విత్తనాలు కూడా అందుబాటులో ఉంచామని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

➡️