కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్ నాయకులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 27న జరగునున్న నేపథ్యంలో పిడిఎఫ్ అభ్యర్థి అయిన కెఎస్ లక్ష్మణరావు విజయం కోసం ప్రజాసంఘాలతో కలిసి యుటిఎఫ్ శ్రేణులు కృషి చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టిఎస్‌ఎల్‌ఎన్.మల్లేశ్వరరావు పిలుపునిచ్చారు. నరసరావుపేటలోని యుటిఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా మల్లేశ్వరరావు మాట్లాడుతూ బడి కోసం బస్సు యాత్ర పేరుతో యుటిఎఫ్ చేసిన పోరాటం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకున్నామని, పోరుబాట ద్వారా రూ.3 వేల కోట్ల ఆర్థిక బకాయిలను విడుదల చేయించుకోగలిగామని, ఈ పోరాటాల్లో కెఎస్ లక్ష్మణరావుతోపాటు పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ప్రత్యక్షంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఇచ్చిన హామీల విస్మరణపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. జీవో 117 రద్దు తర్వాత మార్పుల గురించి, జాబ్ క్యాలెండర్, డీఎస్సీతోపాటు ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలనూ శాసన మండలిలో ప్రస్తావించి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటే పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ నుండి జనవరి వరకు ఇవ్వాల్సిన టిఎ బకాయిలను ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం ఈ 8 నెలల కాలంలో సామాజిక పింఛన్ల పెంపు మినహా మిగతా హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే డీఎస్సీ విడుదల చేస్తామనే ప్రకటన ద్వారా మరోసారి మభ్యపెడుతున్నారని అన్నారు. యుటిఎఫ్ ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో 73 పోలింగ్ కేంద్రాల పరిధిలో 56900 మంది ఓటర్లున్నారన్నారు. వీరందరూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేలా చూడాలన్నారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు, పరిష్కార మార్గాల పట్ల స్పష్టమైన అవగాహనతో సుదీర్ఘ పోరాటం చేస్తున్న కెఎస్ లక్ష్మణరావును శాసన మండలికి మరోసారి పంపిద్దామని అన్నారు. సమావేశంలో యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు షేక్ ఖాసీంపీరా, కోశాధికారి రవిబాబు, రాష్ట్ర ఆడిటర్ కమిటీ సభ్యులు పి.ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు.
