అపరిష్కృతంగా నున్న మున్సిపల్‌ టీచర్ల సమస్యల పరిష్కారం చేయాలి : డిఈఓ కి యుటిఎఫ్‌ వినతి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రాష్ట్ర విభజన జరిగి సుమారు 10 సంవత్సరాలు కావస్తున్నది. ఈ నాటికీ ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని సౌకర్యాలు, ఉత్తర్వులు ఇదే విద్యా వ్యవస్థలో భాగంగా ఉన్న మున్సిపల్‌ టీచర్లకు మాత్రం వర్తించడం లేదు, మున్సిపల్‌ హైస్కూల్స్‌ ఇప్పటికీ తగినంత మంది సబ్జెక్టు టీచర్లు లేరు. 3, 4, 5 తరగతులను విలీనం చేశారు తప్ప ఆ తరగతులు బోధించడానికి స్కూల్‌ అసిస్టెంట్‌ లను ఇవ్వలేదు. ప్రమోషన్లు, బదిలీలు కూడా రెగ్యులర్‌గా జరగడం లేదు. ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. ప్రభుత్వ, పంచాయతీ రాజ్‌ టీచర్లకు ఇచ్చినట్లే మున్సిపల్‌ టీచర్లకు అర్బన్‌ ఎంయిఓ పోస్టులు ఇవ్వాల్సి వుంది. ఇక మున్సిపల్‌ టీచర్ల పిఎఫ్‌ ఖాతాలు మున్సిపాలిటీలలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. జీతాల నుండి మినహాయించే సొమ్ము వారి ఖాతాలకు జమ చేసేందుకు గాని, ఖాతాలలో ఉన్న సొమ్ము అవసరాలకు వినియోగించుకునేందుకు గాని అవకాశం లేకుండా పోయింది కావున మున్సిపల్‌ ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కారం చేయాలని యు టి ఎఫ్‌ డిమాండ్‌ చేసింది. జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్‌ ప్రేమ్‌ కుమార్‌ కు యు టి ఎఫ్‌ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మున్సిపల్‌ సమస్యలపై ఎన్నిమార్లు ప్రాతినిధ్యం చేసినా అవి పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. మున్సిపల్‌ టీచర్ల ఆందోళన రోజు రోజుకూ తీవ్రమవుతున్నదన్నారు. మున్సిపల్‌ హైస్కూళ్ళలో తగినంత మంది సబ్జెక్టు టీచర్లను నియమించేందుకు వీలుగా ఎసిటి, పండిట్‌, పియిటి పోస్టులను అప్‌ గ్రేడ్‌ చేయాలని కోరారు. నవంబర్‌లోగా అప్‌గ్రేడ్‌ పోస్టులలో మున్సిపల్‌ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలనీ, మున్సిపల్‌ ప్రధానోపాధ్యాయుల్లో అర్హులైన వారిని అర్బన్‌ ఎంయిఓలుగా నియమించాలనీ, మున్సిపల్‌ టీచర్లకు జిపిఎఫ్‌ ఖాతాలు తెరిపించాలనీ కోరారు. మున్సిపల్‌ పాఠశాలల్లో నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని నియమించేలా తగిన చర్యలు చేపట్టాలనీ, మున్సిపల్‌ టీచర్ల బదిలీలు వెంటనే చేపట్టాలనీ కోరారు. లేకపోతే అక్టోబర్‌ 2న మున్సిపాలిటీలలో సత్యాగ్రహ దీక్ష, అక్టోబర్‌ 16 న డియిఓ కార్యాలయాల వద్ద 12 గంటలు సత్యాగ్రహ దీక్ష, అక్టోబరు 22 డైరెక్టరేట్‌ వద్ద 24 గంటలు ధర్నా నిర్వహించనున్నామని తెలిపారు. వినతి పత్రం అందజేసినవారిలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు జె అర్‌ సి పట్నాయక్‌, జె ఎ వి ఆర్‌ కె ఈశ్వరరావు, జిల్లా కార్యదర్సులు ఎన్‌.సత్యనారాయణ, సీహెచ్‌ తిరుపతి నాయుడు, విజయనగరం మున్సిపల్‌ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్సులు ఎస్‌. వెంకటరావు, పి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️