ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ ఎడ్యుకేషన్ డివిజన్ కార్యాలయాన్ని వినియోగంలోకి తీసుకురావాలని యుటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం యుటిఎఫ్ నాయకులు ఎడ్యుకేషన్ డివిజన్ కార్యాలయం వద్ద సమావేశమై మాట్లాడుతూ రాష్ట్రంలోని 53 ఎడ్యుకేషన్ డివిజన్‌లను 74 డివిజన్లుగా మార్పు చేస్తూ విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రాజంపేటను కూడా ఎడ్యుకేషన్ డివిజన్‌గా పేర్కొంటూ 9 మండలాలను కలిపి ప్రకటించారని తెలిపారు. ఏడాది గడిచినప్పటికీ డివిజన్ విద్యా శాఖ కార్యాలయం తలుపులు తెరుచుకోలేదన్నారు. ఉప విద్యా శాఖాధికారి గానీ, సిబ్బంది గానీ ఈ కార్యాలయంలో లేకపోవడం వల్ల డివిజన్ కేంద్రం ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మదనపల్లి ఉప విద్యా శాఖాధికారిని అదనపు బాధ్యతలతో రాజంపేటకు కేటాయించినట్లు సామాజిక మాధ్యమం ద్వారా సమాచారముందని తెలిపారు. పాఠశాలల సమస్యలు, పర్యవేక్షణ, విద్యా శాఖ కార్యక్రమాల అమలు మరియు ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన సర్వీసు విషయాల పరిష్కారం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన చెందారు. నేటికీ ఈ డివిజన్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వివిధ రకాల పనుల నిమిత్తం జిల్లా కేంద్రం పైనే ఆధారపడవలసి రావడం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించి రాజంపేట డివిజన్ విద్యా శాఖ కేంద్రం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో రాజంపేటలోని డివిజన్ విద్యా వనరుల కేంద్రంలో కొందరు అధికారులు విద్యా శాఖ పరిపాలన చేపట్టారని, పూర్వ జిల్లా విద్యాశాఖాధికారి రాఘవరెడ్డి హయాంలో ఈ కేంద్రాన్ని డిఇఒ క్యాంపు కార్యాలయంగా మార్పు చేసినప్పటికీ ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించలేదన్నారు. నిరుపయోగంగా ఉన్న డిఆర్‌సి భవనాన్ని డివిజన్‌లోని ఉపాధ్యాయులకు సౌలభ్యం కలిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్, రాష్ట్ర కౌన్సిలర్ చెంగల్ రాజు, జిల్లా కార్యదర్శి వెంకట సుబ్బయ్య, ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య, నాయకులు పాపయ్య, శ్రీనివాసులు, సాంబశివరావు, నరసింహా రావు, రఫి, శివ కుమార్, వెంకట సుబ్బయ్య, విశ్వనాథ్, వేణుగోపాల్, మల్లిఖార్జున పాల్గొన్నారు.
