విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: యుటిఎఫ్‌

ప్రజాశక్తి-చీరాల: పాఠశాల విద్యా రంగంలో నెలకొన్న సమస్యలు సత్వరమే ప్రభుత్వం పరిష్కరించాలని యుటిఎఫ్‌ నాయకులు అన్నారు. మంగళవారం విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ యుటిఎఫ్‌ నాయకులు తహ శీల్దారు, ఎంఈవో, ఎంపీడీవో కార్యాలయాలలో వినతి పత్రాల ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు జరిపిన విద్యారంగ సంస్కరణల ఫలితంగా విద్యారంగం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం సడలి పోతున్నదని, ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యిపోతున్నాయని అన్నారు. పరిస్థితులు చేయిజారకముందే ప్రభుత్వం మేలుకొని పరిస్థితులను చక్కదిద్దాలని అన్నారు. జీవో నెంబర్‌ 117 రద్దుచేసి, జీవో ఎంఎస్‌ నెంబర్‌ 53, ప్రకారం టీచర్లను కేటాయించాలని అన్నారు. హైస్కూల్‌లో నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని నియమించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఒకే సిలబస్‌, ఒకే పరీక్ష విధానం అమలు చేయాలని అన్నారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని యుటిఎఫ్‌ నాయకులు ఆయా కార్యాలయాలలో అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ బాపట్ల జిల్లా సహాధ్యక్షులు బిక్షాలు బాబు, యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ పి సురేష్‌, బాపట్ల జిల్లా ఆడిట్‌ కమిటీ మెంబర్‌ పి సీతారామరాజు, సీనియర్‌ నాయకులు సూరిబాబు, ఎయిడెడ్‌ కన్వీనర్‌ కుర్ర శ్రీను, చీరాల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, నాగమల్లేశ్వరరావు, చీరాల పట్టణ అధ్యక్షులు వెలుగొండారెడ్డి, రాజేష్‌, ఎస్టీ జానీబాషా, లక్ష్మీనారాయణ, రవి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

➡️