రాజకీయ కక్ష తోనే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు : ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి

Feb 14,2025 17:33 #Kurnool

ప్రజాశక్తి – చిప్పగిరి : కూటమి ప్రభుత్వం కక్షతోనే ఎప్పుడో రెండు సంవత్సరాలు క్రితం జరిగిన ఘటనకు బాధ్యులుగా చేసి ఉదేశ్యపూర్వకంగానే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రమైన చిప్పగిరి లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదు. కేవలం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. వీళ్ళు పరిపాలన చేయడానికి రాలేదు. కేవలం లోకేష్ పాదయాత్ర లో ఎవరు పేర్లు తమ రెడ్ బుక్ లో రాసుకున్నారో వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడానికే అధికారంలోకి వచ్చారు. ఇది ఇప్పటితో ఆగదు.  ప్రభుత్వంపై ఎవరైతే వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారో వారిని టార్గెట్ చేస్తూ అక్రమ అరెస్టుల పర్వం సాగిస్తారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ప్రజలను పక్కదారి పట్టించడానికి ఏదో ఒక సంఘటన తెరమీదకు తెస్తూ కాలయాపన చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే మా దగ్గర బడ్జెట్ లేదని కూటమి నేతలు ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారు.  జగన్మోహన్ రెడ్డి అప్పులు ఎక్కువగా చేశారని తప్పుడు మాటలు ప్రజలకు చెప్పి వారిని మోసగిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కూడా తాము ప్రజలతో ఎన్నుకోబడలేదని కేవలం టాంపరింగ్ జరిగినందువలనే తాము అధికారంలోకి వచ్చామని వారికి కూడా తెలుసు. సాధ్యం కానీ హామీలు ఇచ్చినందున, వాటిని అమలు చేయలేక వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వారిని ఏదో రకంగా మభ్యపెట్టి అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటు. అక్రమ అరెస్టులపై ఉన్న శ్రద్ధ పరిపాలనపై లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇలా నాయకులను భయపెట్టి కాలం వెలబుచ్చుతున్నారు. అధికారులు కూడా వారి మాటలు విని ఇలా అక్రమ మార్గంలో  అరెస్టులు చేయకూడదు. ఎల్లకాలం వారే అధికారంలో ఉండరు. ఇది తెలుసుకొని అధికారులు మసులుకోవడం మంచిది. ఇకనైనా ఇలాంటి అక్రమ అరెస్టులు విడిచిపెట్టి ప్రజలకు ఏది కావాలో ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ప్రజల మనసులను గెలుచుకోవాలని, అందుకు దేవుడు కూడా మీకు సద్బుద్ధి ఇవ్వాలని కోరుతున్నామని’ ఆయన అన్నారు.

➡️