ప్రజాశక్తి పెనుగొండ / ఆచంట . ( పశ్చిమగోదావరి జిల్లా) : సిద్ధాంతం గోదావరి మధ్యలంక వెంబడి ఉన్న సుమారు 200 ఎకరాలు భూమిని పేదలకు పంచాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. గురువారం సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం గోదావరి పరివాహక ప్రాంతంలోని లంక భూములలో పర్యటించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సెక్రటేరియట్ సభ్యులు కే తా గోపాలన్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పెరుగు లంక భూములను పంచాలని సిపిఎం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న సందర్భం లేదని విమర్శించారు. సిద్ధాంతం గ్రామంలో వందలాది నిరుపేద కుటుంబాలు కాయ కష్టం తప్ప సెంటు సాగు భూమి లేని దుస్థితి ఉందన్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా నుండి పల్లె పాలెం గ్రామానికి చెందిన కొందరు రైతులు సుమారు 50 ఎకరాలు లంక భూమి ఆక్రమించుకుని సాగు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 400 ఎకరాలు పట్టా సాగుదారులు ఉంటున్న భూముల వెంబడి ఉన్న 200 ఎకరాలను పేదలకు పంచడం ద్వారా వారికి పెద్ద ఎత్తున ఉపాధి కలిగి ఆర్థికంగా నిలబడతారన్నారు . తక్షణమే అధికారులు స్పందించి వశిష్ట గోదావరి తీరానున్న పెరుగు లంక భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి షేక్ పాదుషా, మండల కమిటీ సభ్యులు కప్పల రత్నరాజు, ఆవుల శ్రీనివాసరావు, గుమ్మడి భాను తదితరులు పాల్గొన్నారు.
