ప్రజాశక్తి – కడప పోరాటాల నుండి పుట్టింది వైసిపి అని, తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లు అధికారంలో లేకపోయినా పార్టీని వైఎస్ జగన్ నిలబెట్టడమే చాలా గొప్ప విషయం అన్నారు. చిరంజీవి రెండేళ్లకే ప్రజారాజ్యం పార్టీ అమ్ముకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2019 జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనం సష్టించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నారు. మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిల్ గా భావించిన పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఇంటి వద్దకు సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. విలేకరుల సమావేశంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు. చెన్నూరు: నాలుగేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీ వైసిపి అని మండల యువజన విభాగ అధ్యక్షులు పేరు సాముల నిత్య పూజయ్య, ఉపాధ్యక్షులు కార్తీక్ రెడ్డి అన్నారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ 15 ఏళ్లకు ముందు పార్టీ పుట్టిందని ఇప్పటికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని చెప్పారు. తొమ్మిది సంవత్సరాలు అధికారం లేకపోయినా ఒత్తిళ్లకు తట్టుకొని నిలబడగలిగిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామాంజనేయులురెడ్డి ఆధ్వర్యంలో మండలంలో వైసిపిని బలపరుస్తామని యువజన విభాగంలో యువకులతో కలిసి ముందుకు నడిపిస్తామని చెప్పారు.
వైసిపి అధికారంలోకి రావడం ఖాయం- వైసిపి జిల్లా అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి
