ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ శైవక్షేత్రం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వర్యంలో నడిచే వేద పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఈ పాఠశాలలో ఆగమం శాస్త్రం 4వ ఏడాది చదువుతున్న ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబాల పట్నం గ్రామానికి చెందిన శివశ్రీ, ఛాయకుమారి దంపతుల కుమారుడు సాయి శివ సూరజ్ (16) తన హాస్టల్ గదిలో ఉరేసుకుని మృతిచెందడం గురువారం వెలుగు చూసింది. తోటి విద్యార్థులతో స్నేహంగా మెలిగే విద్యార్థి, బుధవారం రాత్రి కూడా భోజనం అనంతరం ఇతరులతో సాధారణంగా మాట్లాడిన విద్యార్థి తన గదిలో నిద్రకు ఉపకమ్రించాడు. గురువారం తెల్లవారుజామున ఉరికి వేళ్లాడుతుండడాన్ని గమనించిన తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.మరోవైపు శ్రీ వేంకటేశ్వర విద్యాపీఠం వేద పాఠశాల హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్యకు పాఠశాల ప్రిన్సిపాల్ కోట కృష్ణమూర్తి వేధింపులు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగానే కోటప్పకొండ ఆలయ ప్రధాన అర్చకులు అప్పయ్య గురుకుల్, ఇతర అర్చకులు, బ్రాహ్మణసంఘం పెద్దలు నరసరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ ప్రవర్తన సరిగా ఉండదని, మూణ్ణెల్ల కిందట ఒ విద్యార్థినిని చితకబాదాడని చెబుతున్నారు. దీనికితోడు హాస్టల్ నిర్వహణ సరిగా లేదని, భోజనం కూడా సరిగా పెట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా నరసరావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థి మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సందర్శించి నివాళులర్పించారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. తల్లిదండ్రులను పరామర్శించారు. ఆత్మహత్య బాధాకరణమని, అయితే అతనికి మతిస్థిమితం లేకుండా ఆత్మహత్య చేసుకున్నాడంటూ చెప్పాలని తల్లిదండ్రులను పోలీసులు ఒత్తిడి చేయడం దారుణమన్నారు. మానసిక స్థితిపై ఏమైనా అనుమానాలుంటే అది వైద్యులు నిర్థారించాలేగాని పోలీసులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. దీనిపై విచారణ చేసి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు పనిచేసిన ప్రిన్సిపాల్ వెంకటరామశర్మ చాలా బాగా పనిచేశారని, కొన్ని నెలల క్రితం వచ్చిన ప్రస్తుత ప్రిన్సిపాల్ ప్రవర్తన సరిగా లేదని టిటిడి బోర్డు దృష్టికి పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు తీసుకెళ్లారని, దీనిపై విజిలెన్స్ కమిటీ వచ్చి విచారణ చేసి నివేదించినా టిటిడి బోర్డు సభ్యులు స్పందించలేదని విమర్శించారు. హాస్టల్లో విద్యార్థులకు సరిగా భోజనం పెట్టడం లేదని, విద్యార్థుల నుండి హాస్టల్ సిబ్బంది డబ్బులు వసూలు చేసి బెట్టింగ్ ఆడుతున్నారని, వారికి ప్రిన్సిపాల్ సహకరిస్తున్నారని విమర్శించారు.