ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : పచ్చని పంట పొలాల్లో కొలువుదీరి ఉండే మండలంలోని బడుగువానిలంక విజయ దుర్గమ్మ వారి తీర్థ మహౌత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూల తోటలు, కూరగాయలు, వాణిజ్య పంటల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించే ఈ తీర్థ మహౌత్సవం కనుల పండువుగా జరిగింది. లంక గ్రామాలకు చెందిన రైతుల భూములు ఈ ప్రాంతంలో ఉండడం వల్ల వారంతా ఈ అమ్మవారిని ఇష్ట దైవంగా ఆచారంగా వస్తుందని కూటమి నాయకులు పాలూరి గోవిందరాజు, దూలం రాంబాబు, పడాల అమ్మిరాజు అన్నారు. ఈ మండలంతో పాటు కడియం, ఆత్రేయపురం, రావులపాలెం మండలాలకు చెందిన రైతులు కూడా ఈ తీర్థ మహౌత్సవానికి వచ్చి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ తీర్థ మహౌత్సం సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు తగినన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాలలో విద్యుత్ అలంకరణతో తీర్చి దిద్దారు. అలాగే పలు సాంస్కఅతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సిఐ సిహెచ్.విద్యాసాగర్ ఎస్సై ఎం.అశోక్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.