ఓటుహక్కు పొందేందుకు ఇదే చివరి అవకాశం

Mar 31,2024 21:25

ప్రజాశక్తి-విజయనగరంకోట : ప్రస్తుతం దేశమంతా ఎన్నికల సీజన్‌. పార్లమెంటుతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తుండటంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించగా, మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడి, నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతుంది. మనల్ని పరిపాలించే పాలకులను ఎన్నుకొనే సువర్ణావకాశం ఇది. ఈ మహాక్రతువులో మనం కూడా భాగస్వాములు కావాలంటే, కేవలం ఓటుహక్కును కలిగి ఉంటేచాలు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది. అత్యంత విలువైన, అమూల్యమైన ఓటుహక్కును పొందడానికి ఇప్పటికీ అవకాశాన్ని కల్పిస్తోంది మన ఎన్నికల కమిషన్‌.దేశంలో 18 సంవత్సరాలు దాటిన భారత పౌరులందరికీ ఓటుహక్కు కల్పిస్తోంది మన రాజ్యాంగం. దీనికి దరఖాస్తు సమర్పించడం ఒక్కటే పౌరులు చేయాల్సిన పని. ఈ ఏడాది ఈ నెల ఒకటో తేదికి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు పొందే అవకాశాన్ని కల్పించారు. వీరంతా ఈ నెల 14వ తేదీలోపల దరఖాస్తు చేసుకోగలిగితే, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభిస్తుంది. ఆ తరువాత దరఖాస్తు చేసినా ఈ ఎన్నికల్లో ఓటు చేసే అవకాశం మాత్రం ఉండదు. కొత్త ఓటు కోసం, లేదా చిరునామా మార్పు కోసం ఈ నెల 14వ తేదీలోపు వచ్చే దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తారు. వాటిని పదిరోజుల్లోగా పరిశీలించి, అర్హత ఉంటే ఓటర్ల జాబితాలో చేరుస్తారు. వీరికి మే 13న జరిగే ఎన్నికల్లో ఓటువేసే అవకాశం లభిస్తుంది. ఏప్రిల్‌ 14 తరువాత వచ్చే దరఖాస్తులను మాత్రం ఎన్నికల తరువాత మాత్రమే పరిశీలిస్తారు. వాస్తవానికి నామినేషన్లను దాఖలు చేసేవరకు ఓటు నమోదుకు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. అయితే వచ్చిన వాటిని పరిశీలించి, జాబితాల్లో చేర్చడానికి పదిరోజుల సమయం పడుతుంది. కాబట్టి, దరఖాస్తు చేయడానికి చివరితేదీ ఏప్రిల్‌ 14గా నిర్ణయించారు.ఎలా దరఖాస్తు చేయాలి ?ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఎన్నికల షెడ్యూల్‌ కూడా వచ్చేసింది. అందువల్ల ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారానే కొత్తగా ఓటు నమోదుకు, చిరునామా మార్పునకు అవకాశం ఉంది. 18 ఏళ్లు నిండినవారు ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌, హెచ్‌టిటిపిఎస్‌ః//విఒటిఇఆర్‌ఎస్‌.ఇసిఐ.జిఓవి.ఐఎన్‌/వెబ్‌సైట్‌, హెచ్‌టిటిపిఎస్‌ః// సిఇఒఎఎన్‌డిహెచ్‌ఆర్‌ఎ.ఎన్‌ఐసి.ఐఎన్‌/వెబ్‌సైట్‌ ద్వారా ఫారం-6లో దరఖాస్తు చేయాలి. చిరునామా, ఓటు బదిలీ మార్పు కోసం ఫారం-8 ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను పదిరోజుల్లో పరిశీలన పూర్తిచేసి, నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా ఓటుహక్కు పొందినవారి పేర్లును అనుబంధ జాబితా ద్వారా, అలాగే చనిపోయినవారు, ఆబ్సెంటీస్‌, బదిలీ ఓటర్ల వివరాలను ఎఎస్‌డి జాబితాలో నమోదు చేసి, ఆయా పోలింగ్‌ కేంద్రాల ప్రిసైడింగ్‌ అధికారులకు అందజేస్తారు. ఇప్పటికే ఓటు కోసం దరఖాస్తు చేసి, ఓటుహక్కు పొందిన వారికి ఇప్పటికే ఓటరు గుర్తింపు కార్డులను పంపించారు. మొదటి విడత 81,633, రెండో విడత 6,476 ఎపిక్‌ కార్డులను వారి చిరునామాకు పంపించారు.ఓటు ఉందోలేదో తెలుసుకోవడం ఎలా ? ఈ ఏడాది మార్చి 20వ తేదీ నాటికి జిల్లాలో సుమారు 15,47,922 మంది ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్ల చేర్పింపు కొనసాగుతుండటంతో ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. జాబితాలో మార్పులు, చేర్పులూ కొనసాగుతున్నాయి. అయితే చాలా మందికి తమ ఓటుపై సందేహాలు ఉన్నాయి. తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకొనేందుకు పలు మార్గాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన ఓటర్ల జాబితాల్లో తమ పేరును ఆన్‌లైన్‌ ద్వారా చూసుకోవచ్చు. బూత్‌ల వారీగా కూడా ఓటర్ల జాబితాలను ఇప్పటికే ప్రకటించారు. బిఎల్‌ఒల వద్దనున్న ఓటర్ల జాబితాలో కూడా తమపేరు తనిఖీ చేసుకోవచ్చు. కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ ఫోన్‌ నంబర్లు 08922-797120, 08922-797124 ను సంప్రదించి తమ ఓటు వివరాలను తెలుసుకొనే అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించింది.
అవకాశాన్ని వినియోగించుకోవాలి
కొత్తగా ఓటుహక్కు పొందడానికి, అర్హత ఉన్న వారంతా ఈ నెల 14వ తేదీలోగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. వీరికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో కొత్తగా ఓటువేసే అవకాశం లభిస్తుంది. ఓటు వజ్రాయుధం లాంటిది. అర్హత ఉన్నవారంతా ఓటు హక్కు పొందడమే కాకుండా, ఎన్నికల్లో కచ్చితంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి.- నాగలక్ష్మి, జిల్లా కలెక్టర్‌

➡️