కర్రోతుకు ఎమ్మెల్సీ

Apr 1,2024 20:59

ప్రజాశక్తి- నెల్లిమర్ల : టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజుకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్‌ చేసినట్లు తెలిస్తోంది. తన అనుచరులతోపాటు సోమవారం మంగళగిరిలోని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కర్రోతు భేటీ అయ్యారు. పొత్తులో భాగంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే టిక్కెట్టును జనసేనకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ కర్రోతు బంగార్రాజు అప్పటి నుంచి అదిష్టానం తీరుపై గుర్రుగానే ఉన్నారు. తనకు కచ్చితంగా టిక్కెట్టు ఇవ్వాలని ఒకానొక దశలో ఆందోళనకు దిగారు. తాజాగా కార్యకర్తల ఒత్తిడి మేరకు నెల్లిమర్ల టిక్కెట్టు మార్చకపోతే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో టిడిపి అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన లోకేష్‌ను కలిశారు. సుమారు గంట పాటు నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితిపై కర్రోతు లోకేష్‌కు వివరించారు. లోకేష్‌ మాట్లాడుతూ జనసేన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పార్టీ అధికారలోకి రాగానే కర్రోతుకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగు మండలాల టిడిపి నాయకులు, జనసేన నాయకులతో కలిసి కట్టుగా పనిచేసి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని ఆదేశించారు. అయితే కర్రోతు తన కార్యకర్తలు, నియోజకవర్గం నాయకులతో మాట్లాడి తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో చెబుతామని లోకేష్‌కు చెప్పినట్లు తెలిస్తోంది. లోకేష్‌ను కలిసిన వారిలో నెల్లిమర్ల, భోగాపురం టిడిపి అధ్యక్షులు కడగల ఆనంద్‌కుమార్‌, కర్రోతు సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, నాయకులు లెంక అప్పలనాయుడు, మాజీ జెడ్‌పిటిసి ఆకిరి ప్రసాద్‌ తదితరులున్నారు.

➡️