క్వారీలపై అధికారులకు ఫిర్యాదు

Apr 1,2024 21:03

ప్రజాశక్తి- భోగాపురం : క్వారీలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని రామచంద్రంపేట, పెద్ద కొండరాజుపాలెం గ్రామాలకు చెందిన పెద్దలు కలెక్టర్‌ తో పాటు జిల్లా ఉన్నతాధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. తమ గ్రామాలకు అనుకొని చుట్టు పక్కల క్వారీలు ఉండటంతో చాలా అవస్థలు పడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా బాంబు పేలుళ్లకు ఇళ్ల పునాదులు కదిలి పోతున్నాయని తెలిపారు. తాగునీరు కలుషితం కావడంతో ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన బడి చనిపోతున్నారని పేర్కొన్నారు. పంచాయతీలో అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా క్వారియింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. కొత్త క్వారీ ఏర్పాటు చేయవద్దని ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్తులంతా చెప్పినప్పటికీ ఆ సంస్థకు అనుమతులు మంజూరు చేసారని అన్నారు. ఈ క్వారీకి సమీపంలోనే పాఠశాల, గ్రామానికి సరఫరా చేసే తాగునీటి ట్యాంకు ఉన్నప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా అనుమతులు ఇచ్చేస్తున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు. వాహనాల రద్దీతో రహదారులు కూడా పూర్తిగా పాడైపోయాయని చెప్పారు. అధికారులు ఇచ్చిన పరిమితులకు మించి క్వారీయింగ్‌ చేస్తున్నందున వీటిపై విచారణ చేయాలని కోరారు. క్వారీల నుంచి మమ్మల్ని కాపాడాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి, మైనింగ్‌, పొల్యూషన్‌ శాఖల అధికారులు కూడా వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు దుక్క అప్పన్న, రమణ, కోలా రామసూరి, సుగ్గు రాము, గొంప నరసింహ, నువ్వు బంగార్రాజు, రాము, నీలాద్రి బాలకష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️