డామిట్‌..! కథ అడ్డం తిరిగింది

Apr 1,2024 20:58

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : డామిట్‌…! కథ అడ్డం తిరిగింది. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్య్రంగా రంగంలోకి దిగేందుకు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత సిద్ధమయ్యారు. ఈమేరకు సోమవారం ప్రచారాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించారు. కొండ కరకాం, కొత్త అగ్రహారం, నాగవంశపు వీధి, విటి అగ్రహారం, ప్రదీప్‌నగర్‌, బాబామెట్ట, పూల్‌బాగ్‌లో ప్రచారం చేశారు. దీంతో, మిగిలిన నియోజకవర్గాలతోపాటు విజయనగరంలోనూ అసమ్మతి సెగ రాజుకున్నట్టైంది. గీత బరిలో దిగడం అనివార్యమైతే టిడిపికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టేనని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మీసాల గీత విజయనరగం ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం విధితమే. అప్పట్లో కేంద్ర మంత్రిగావున్న అశోక్‌ గజపతిరాజు, గీతను పక్కనబెట్టి నియోజకవర్గంలో రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారు. ఒకానొక దశలో అధికారిక కార్యక్రమాలు కూడా ఆమెకు తెలియకుండా చేసే పరిస్థితి ఎదురైంది. మరోవైపు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలన్నా అశోక్‌ బంగ్లా నుంచి మాత్రమే ప్రకటన చేయాలనే నిబంధన. తీరా బంగ్లాకు వెళ్తే అశోక్‌ అనుచరులు ప్రతికూల పరిస్థితులను సృష్టించడం పరిపాటిగా మారేది. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారడంతో గీత ఎమ్మెల్యేగా ఉండగానే అశోక్‌ను విభేదించారు. ఆయనను సవాలు చేస్తూ బంగ్లాకు సైతం వెళ్లడం మానేశారు. బిసి ఎమ్మెల్యేను కావడం వల్ల వివక్ష చూపుతున్నారని, మహిళను కావడంతో చిన్నచూపు చూస్తున్నారని ఆమె అప్పట్లో ఆరోపించారు. ఈలోపు వచ్చిన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు తన కుమార్తె అదితి విజయలక్ష్మిగజపతిరాజుకు ఇప్పించుకున్నారు. ఆయన ఎంపీగా పోటీచేశారు. అయినా గీత పార్టీని వీడలేదు. ఆ ఎన్నికల్లో తండ్రి, కూతురూ కూడా ఓటమి చవిచూశారు. గీతను పక్కనబెట్టడం వల్లే బిసి ఓట్లు తగ్గాయని, అందువల్లే అదితికి ఓటమి తప్పలేదని అప్పట్లో చర్చనడించింది. అనంతరం గీత పార్టీలో కొనసాగుతూ తన కేడర్‌తో బమేకమై పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కంటోన్మెంట్‌లో ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని ఎత్తివేయాలంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ద్వారా అశోక్‌ ప్రయత్నం చేయడంతో స్థానికంగా తనపై పార్టీలో అణిచివేత చర్యలు జరుగుతున్నాయని, అందువల్లే తన అనుయాయుల అభిప్రాయం మేరకు కార్యాలయం ఏర్పాటు చేశానని సమాధానం చెప్పారు. వాస్తవాలను అర్థం చేసుకున్న హైకమాండ్‌ కూడా మిన్నకుండిపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా గీత సీటు ఆశించారు. సీటు అశోక్‌ కుమార్తెకు వచ్చింది. సీటు ప్రకటించే ముందుగానీ, ప్రకటన తరువాత నెలరోజులు కావస్తున్నా గీతకు పార్టీ నుంచి ఎలాంటి దిశా నిర్ధేశం లేదు. దీంతో, స్వతంత్రంగా రంగంలోకి దిగాలని కొద్దిరోజులుగా ఆమె ఆనుయాయులు ఒత్తిడి చేస్తున్నారు. ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్న ఆమె సోమవారం లాంఛనంగా ఎన్నికల ప్రచారానికి నిర్ణయం తీసుకున్నారు. కొంతమంది ముఖ్యులను కలిసి ఆశీర్వదించాలని కోరారు. ఈ పరిణామం టిడిపి అభ్యర్థికి నష్టం చేకూరుస్తుందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. గీత 2009లో పిఆర్‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి విజయనగరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2014లో టిడిపి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం విజయనగరం నగరపాలక సంస్థ, రూరల్‌లో ఆమెకు ప్రత్యేక కోటరీ ఉంది.

➡️