పరిశ్రమల మూతతో ఉపాధికి గండి

Apr 1,2024 20:57

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి. మరో నెలరోజుల్లో పొలింగ్‌ కూడా జరగనుంది. ఈనేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యే, ఎంపీ, అభ్యర్థులు, నాయకులు ప్రజలను ఓట్లను అభ్యర్థించేందుకు పోటీపడుతున్నారు. ఇటువంటి పోటీ ప్రజాసేవలోనూ, జిల్లా, నియోజకవర్గ అభివృద్ధిలోనూ కనిపించడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో అభివృద్ధికి పట్టుకొమ్మ వంటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయలేదు. కొత్త పరిశ్రమలు తీసుకురాలేదు సరికాదా, ఉన్న కొద్దిపాటి పరిశ్రమల మూసివేతకు కారణమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో మెజార్టీ ప్రజానీకం పొట్టకూటికోసం పుట్టెడు అవస్థలు పడాల్సిన దుస్థితి దాపురించింది. వీటన్నింటినీ పక్కనబెట్టిన వైసిపి, టిడిపి నాయకులు, అభ్యర్థులు గతంలో ఇచ్చిన హామీలనే తిరిగి వల్లెవేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 80శాతం ప్రజానీకం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవస్తున్నారు. పాలకుల విధానాల వల్ల వ్యవసాయ విస్తీర్ణం ఏటా తగ్గిపోతోంది. మరోవైపు ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు మూతపడుతునే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా అధినేతల పల్లకీలు మోయడం తప్ప రాజకీయంగా జోక్యం చేసుకునే నాధులే జిల్లాలో లేకపోవడంతో ఈ రెండు రంగాల్లోనూ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. దీంతో, జిల్లాలో గ్రామీణ ముఖచిత్రాలు మారాయి. జిల్లా భౌగోళికంగా 16, 34, 750 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో వ్యవసాయానికి అనువుగావున్న భూమి 9,25,387.5 ఎకరాల వరకు ఉంది. వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటలు సాగుచేసేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా వరి, చెరకు, మొక్కజొన్న, పత్తి, మినుములు, పెసలు తదితర అపరాలు వంటి వ్యవసాయ పంటలు ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో కేవలం 3,41,130 ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. ఇందులో అత్యల్పంగా ఉద్యాన పంటల సాగు కేవలం 1,67,902 ఎకరాల్లో మాత్రమే ఉంది. నాన్‌ ఫుడ్‌ క్రాప్‌ ఏరియా కూడా 23,096 (6శాతం) ఎకరాలుగా నమోదైంది. గతంలో పోలిస్తే క్రమంగా సాగు విస్తీర్ణం తగ్గుతోంది. సాగు విస్తీర్ణం కన్నా బీడువారుతున్న సాగుభూములు 2శాతం అధికంగా ఉండడం గమనార్హం. సుమారు 80శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ, సాగునీటి వసతి కల్పించక పోవడం, ఉద్యాన పంటలను తగినంతగా ప్రోత్సహించకపోవడం, ప్రభుత్వం తరపున బోర్లు, బావులు మంజూరు చేయకపోవడం, మైక్రో ఇరిగేషన్‌ పథకాలు పూర్తిగా స్తంభించడం వంటి కారణావల్ల సాగు భూమి తగ్గుతోంది. లక్షా 30వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తలపెట్టిన తోటపల్లి ప్రాజెక్టు మిగులు పనులు పూర్తికాక పోవడం వల్ల సాగునీటి లక్ష్యం నీరుగారుతోంది. ఇప్పటికీ సుమారు 76వేల ఎకరాలకు మించి సాగునీరు అందడం లేదు. తారకరామ తీర్థసాగర్‌ పనులు చేపట్టి దాదాపు 17ఏళ్లు దాటుతున్నా అతీగతీ లేదు. జంఝావతి ప్రాజెక్టు తలపెట్టిన నాలుగు పదులు ఎప్పుడో దాటిపోయాయి. ఇక మైక్రో ఇరిగేషన్‌కు అనేది దాదాపు లక్ష్యం అనేదే లేకుండా పోయింది. దీనికితోడు వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు స్థానికంగా మార్కెట్‌ సదుపాయం కల్పించక పోవడం కూడా సాగుభూమి తగ్గుదలకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో, వ్యవసాయ రంగం ద్వారా జిల్లాకు కేవలం రూ.13,343 కోట్ల (41.2శాతం) ఆదాయం మాత్రమే వస్తోంది. ఈ ప్రభావం రైతులతోపాటు వ్యవసాయ రంగంపై ఆధారపడిన కార్మికులు, వృత్తిదారులపైనా పడింది. మత్స్యకారులు, వడ్రంగి, చేనేత వంటివృత్తుల నుంచి నేటితరం దూరమౌతోంది. సుమారు 30ఏళ్లలో వచ్చిన మార్పులే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జిల్లాలో జ్యూట్‌ మిల్లులు దాదాపు మూతపడ్డాయి. ఒకప్పుడు 20మిల్లులు ఉన్న ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం నాలుగైదుకు మంచి తిరగడం లేదు. ఫెర్రో ఎల్లాయీస్‌ కంపెనీలకు చెంతనే ముడిసరుకు ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల సహకారం కొరవడడంతో ఇప్పటికే ఉన్న పరిశ్రమలు ఉనికి కోల్పోవాల్సి వస్తోంది. పూసపాటిరేగ ప్రాంతంలో అరకొర పరిశ్రమలు మినహా ఇంకేమీ చెప్పుకోదగ్గ పరిశ్రమలేవీ లేవు. ఉన్న కొద్దిపాటి పరిశ్రమల మూత వల్ల వేలాది మంది ఉపాధి కోల్పోవడంతో ఆయా కుటుంబాల వారి ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నాయి. జిల్లాకు వస్తున్న వార్షిక ఆదాయంలో పారిశ్రామిక రంగం ద్వారా వస్తున్న ఆదాయం ఏటా తగ్గిపోవడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ఆచూతూచీ ఓట్లేసుకోవాల్సిన అవసరముందనే చర్చ జనాల్లో ముమ్మరంగా సాగుతోంది.

➡️