భావితరాలకు దిక్సూచి ‘కళింగ కథాజాడ’

Mar 31,2024 21:30

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కళింగ ఆది ఆంధ్ర చరిత్ర తెలిపి, భవిష్యత్తు తరాలకు దిక్సూచిగా కళింగ కథాజాడ పుస్తకం నిలుస్తుందని ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో డిఇ చీకటి దివాకర్‌ ఉద్యోగ విరమణ సందర్భంగా స్థానిక జెడ్‌పి సమావేశ మందిరంలో ఆదివారం సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా దివాకర్‌ రచించిన కళింగ కథాజాడ అనే పుస్తకాన్ని ప్రముఖ సాహితీవేత్త వెలుగు రామానాయుడు ఆవిష్కరించారు. అనంతరం పుస్తకం గురించి అట్టాడ అప్పలనాయుడు మాట్లాడారు. వందేళ్ల చరిత్రను నేటి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పుస్తకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. దాన్ని నాలుగు విభాగాల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పులు గురించి విశదీకరించారని తెలిపారు. సాహితీ వేత్తలకు జన్మస్థలం, గమ్య స్థలం సమాజమే అన్నారు. అటువంటి సమాజం గురించి మన పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం మనపై ఉందన్నారు. అనంతరం పుస్తక ప్రాముఖ్యతను రచయిత గంటేడ గౌరినాయుడు వివరించారు. ఈ సందర్భంగా చీకటి దివాకర్‌ ఉద్యోగిగా చేసిన కృషిని, సాహితీ వేత్తగా అందించిన సేవలను అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరినాయుడు, వెలుగు రామునాయుడు, మన్యం జిల్లా పిఆర్‌ ఎస్‌ఇ ఎంవిఆర్‌ కృష్ణాజీ, ఎంవిఎన్‌ వెంకటరావు, రిటైర్డ్‌ ఆర్‌డిఒ కెఆర్‌డి ప్రసాదరావు కొనియాడారు. అనంతరం పిఆర్‌ ఇంజినీరింగ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు, ఉద్యోగులు, సాహితీవేత్తలు, కళాకారులు.. దివాకర్‌, చంద్రిక దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో నాటక రంగ కళాకారులు శేషారావు, పిఆర్‌ ఎస్‌ఇ గుప్త, జెడ్‌పి సిఇఒ శ్రీధర్‌ రాజు, ఎంవిఎన్‌ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

➡️