వైసిపిది టైంపాస్‌ పాలన

Mar 31,2024 21:23

ప్రజాశక్తి-విజయనగరం కోట : వైసిపిది టైంపాస్‌ పాలనని, ఆ పార్టీ హయాంలో ప్రజలకు ఎటువంటి మేలూ జరగలేదని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతిరాజు అన్నారు. ఆదివారం స్థానిక అశోక్‌ బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి పనులు చేయించుకున్నామని, విభేదించినాడు తనతో సహా మిగతా వారు రాజీనామా చేశారని గుర్తుచేశారు. గత ఐదేళ్లపాటు వైసిపి ఎమ్‌పి ఏం చేశారని నిలదీశారు. కలిశెట్టి అప్పలనాయుడు పార్టీకి సేవ చేయడంతో ఆయనకు ఎమ్‌పి టికెట్‌ లభించిందని తెలిపారు. తన ఆరోగ్యం సహకరించక పోవడం వల్లే పోటీ చేయడం లేదని తెలిపారు. టికెట్‌ రాని వారికి నచ్చజెప్పే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అనంతరం ఎమ్‌పి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలపైనా తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి, టిడిపి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్‌ శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, పట్టణ అధ్యక్షులు పి.లక్ష్మీవరప్రసాద్‌, మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, గంటా పోలినాయుడు, వేచలపు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.అదితి ప్రచారంనగరంలోని 23వ, 25వ డివిజన్ల పరిధిలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు ఎన్నికల ప్రచారం చేశారు. మార్కెట్లో వ్యాపారుల సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావాలని ఆమె తెలిపారు.

➡️