సాగునీరు అందేనా?

Apr 1,2024 21:00

ప్రజాశక్తి-రేగిడి : సాగునీటి ప్రాజెక్టుల పట్ల టిడిపి, వైసిపి ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఏళ్ల తరబడి ప్రాజెక్టుల కాలువల పనులు పూర్తి చేయకపోవడంతో శివారు భూములకు నీరందక ఏటా రైతులు నష్టపోతూనే ఉన్నారు. రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాల భూములకు మడ్డువలస, తోటపల్లి జలాశయాల నుండి సాగునీరు సక్రమంగా అందక రైతులకు కడగండ్లే మిగులుతున్నాయి. మడ్డువలస ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువలకు లైనింగ్‌ పనులు, పిల్ల కాలువలకు ఆధునీకరణ పనులు లేక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి, సంతకవిటి, గంగవారి సిగడాం మండలాల్లో 52వేల ఎకరాలకు చుక్క నీరు అందక రైతులు నష్టపోతున్నారు. ప్రధాన కాలువలకు లైనింగ్‌ పనులు లేక పిల్ల కాలువలకు కనీసం చుక్క నీరు రాక కనీసం ఆరుతడి పంటలు కూడా సాగునీరు అందని దుస్థితి నెలకొంది. తోటపల్లి రిజర్వాయర్‌ నుండి రాజాం కెనాల్‌ కు సంబంధించి వంగర, రాజాం, రేగిడి, సంతకవిటి మండలాలతో పాటు జి.సిగడాం మండలాల్లో 39వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ కనీసం పదివేల ఎకరాలకు కూడా సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. తోటపల్లి రిజర్వాయర్‌ రాజాం కెనాల్‌ నుండి పిల్ల కాలువలు తవ్వినప్పటికీ చిన్న శిర్లాం జంక్షన్‌ వద్ద రాజాం -పాలకొండ ప్రధాన రహదారి తవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకు అనుమతులు లేక పిల్ల కాలువ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. తోకలవలస, తాటిపాడు, సంతకవిటి మండలం గొల్ల సీతారాంపురం పొలాలకు సాగునీరు అందక నేల బావులు, మోటారులపై ఆధారపడి రైతులు పంటలు పండిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో మడ్డువలస కుడి ప్రధాన కాలువకు కొంతవరకు లైనింగ్‌ పనులు , పిల్ల కాలువలు తవ్వించి కొన్ని గ్రామాలకు సాగునీరు అందించారు. వైయస్సార్‌ ప్రభుత్వం వచ్చి ఐదేళ్లవుతున్నా ఈ ప్రాజెక్టుల ప్రధాన కాలువలు, పిల్ల కాలువల పనులు కనీసం కూడా జరగని పరిస్థితి నెలకొంది. మడ్డువలస, తోటపల్లి ప్రధాన పిల్ల కాలువల ఆధునీకరణ పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపించినప్పటికీ నేటి వరకు కార్యరూపం దాల్చలేదు. రానున్న ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులపై ఆధునీకరణ పనులకు నిధులు సమకూర్చి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రెండింటి నుంచీ నీరు రాలేదు
మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్‌ నుండి శివార గ్రామాలకు సాగునీరు అందడం లేదు.. సాగునీరు అందక నేలబావులు , మోటార్‌ బావులతోనే ఆశ్రయించి పంటలు పండిస్తున్నాం.. శివార గ్రామాలకు సాగునీరుకు అందించేందుకు ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
– అంబళ్ల సత్యం, అంబకండి గ్రామం
సాగునీరందిస్తే ఏడాదికి మూడు పంటలు
ఈ రెండు ప్రాజెక్టుల నుంచి ప్రధాన, పిల్ల కాలువలు ద్వారా సాగునీరు అందిస్తే ఏడాదికి మూడు పంటలు పండించవచ్చు. కనీసం ఖరీఫ్‌ , రబీ పంటలకు కూడా ప్రాజెక్టు నుంచి సాగునీరు అందడం లేదు. దీంతో పంటలు పండించేందుకు రైతులు, కౌలు రైతులు రావడం లేదు.
– నారు జనార్ధన రావు, రేగిడి

➡️