గుర్తిస్తారో.. లేదో?

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి:  ‘ పంటల నష్టాన్ని ప్రభుత్వ సిబ్బంది సరిగా గుర్తించ గలుగుతారో… లేదో? ప్రభుత్వం కూడా పరిగణనలోకి తీసుకుంటుందో? నిబంధనల పేరిట తిరస్కరిస్తుందో?’ అంటూ అన్నదాత అయోమయంలో పడ్డాడు. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన రైతన్న ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. పంట నష్ట గణనకు ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులు జారీచేయడంతో వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది మంగళవారం క్షేత్ర స్థాయిలోకి దిగారు. దాదాపు ఐదు రోజుల తరువాత పంటనష్టం గుర్తించేందుకు దిగడంతో జరిగిన నష్టాన్ని అధికారులు సరిగా అంచనా వేస్తారా? లేదా? అన్న సందేహంలో రైతులున్నారు. ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు కురిసిన వర్షాలకు జిల్లా అతలాకుతలమైన విషయం విదితమే. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ప్రధానంగా చేతికందిన వరి జలదిగ్బంధానికి గురైంది. కోసిన కంకులతో తమకు సంబంధం లేదని ప్రభుత్వం చేతులెత్తేసోంది. మరోవైపు కేవలం పంటల ముంపును మాత్రమే వ్యవసాయ శాఖ పరిగణనలోకి తీసుకుని ప్రాథమిక అంచనా వేసింది. జిల్లా అతలాకుతలంగా కాగా కేవలం 2,769.63 ఎకరాలు మాత్రమే ముంపునకు గురైనట్టుగా గుర్తించడం గమనార్హం. ఇందులో వరి 2743.63 ఎకరాల్లో నష్టపోయినట్లు తేల్చారు. మెంటాడ మండలంలో 15 ఎకరాల్లో, నెల్లిమర్ల మండలంలో 11 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు అంచనాకు వచ్చారు. ఈ సమాచారం తెలిసిన రైతులు, రైతు సంఘం నాయకులు విస్తుపోతున్నారు. మునిగిన పంటనే సరిగ్గా గుర్తించలేని ప్రభుత్వం గడిచిన ఐదు రోజుల వ్యవధిలో పూర్తిచేసిన కోతలను, నేలకొరిగిన చేను కాస్త నిలబెట్టడం లేదా యంత్రాలతో అక్కడికక్కడే నూర్పిడి చేయడం వంటివి ఎలా గుర్తిస్తారో? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గుర్తించిన పంటల ముంపు మెరకముడిదాం, రేగిడి మినహా మిగిలిన 25 మండలాల్లో ఉన్నప్పటికీ అది అంతంత మాత్రంగానే ఉంది. కేవలం 284 గ్రామాల్లోనే ముంపు నమోదైంది. ఇందులో అత్యధికంగా పూసపాటిరేగ మండల పరిధిలోని 13 గ్రామాల్లో 380, డెంకాడ మండలంలోని 16 గ్రామాల్లో 350 ఎకరాలు, శృంగవరపు కోట మండలంలో 37 గ్రామాల పరిధిలో 263 ఎకరాల్లో పంటల ముంపును గుర్తించారు. అత్యల్పంగా దత్తిరాజేరు మండలంలో 2.53 ఎకరాల ముంపు విస్తీర్ణం నమోదైంది. మరోవైపు కోతలు పూర్తయిన వరికి నష్టపరిహారం ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చిచెప్తున్న సంగతి తెలిసిందే. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెబుతున్నా, నాణ్యత పేరుతో ధర తగ్గించడం వంటివి చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల కొనుగోలుకు నిరాకరించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ రైతులు గత అనుభవాలను గుర్తుచేస్తున్నారు. నష్టపరిహారం చెల్లింపునకు ప్రభుత్వం కూడా కఠిన నిబంధనలు విధించింది. ఈ నేపథ్యంలో సాక్ష్యాలు చెరిగిపోయిన తరువాత దిగుతున్న ప్రభుత్వ సిబ్బంది పంటనష్టాన్ని సరిగా గుర్తించాలని రైతులు కోరుతున్నారు.

➡️