పంటనష్టం వాటిల్లొద్దు

వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్‌పి దీపిక, జెసి అశోక్‌

ప్రజాశక్తి-విజయనగరం : బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుపాను తీరం వైపు దూసుకువస్తున్న దృష్ట్యా కోస్తా జిల్లాల్లో ప్రాణనష్టం జరగకుండా ఆయా జిల్లా కలెక్టర్‌లు అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. వ్యక్తులతో పాటు పశువుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం ఉదయం మించౌంగ్‌ తుపాను బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం వుందని తుపాను హెచ్చరికల కేంద్రం సూచనలు చేస్తున్న దష్ట్యా కోస్తా ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు అప్రమత్తంగా వుంటూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాను సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సోమవారం జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు.తుపాను దృష్ట్యా రైతులకు పంటనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటివరకూ కోతలు చేపట్టని పక్షంలో కోతలు పూర్తిచేయకుండా వారికి సూచించాలని, కోతలు పూర్తయిన పక్షంలో రైతుల వద్ద వున్న ధాన్యం తక్షణమే కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే పంటనష్టం అంచనాలు వేసి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. తుపాను నష్టం త్వరగా అంచనా వేయడంలో వలంటీర్ల వ్యవస్థను సమర్ధంగా వినియోగించుకోవాలన్నారు.వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఎస్‌పి దీపిక పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిజాస్టర్‌ మేనేజర్‌ అథారిటీ డిపిఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

➡️