ప్రజాశక్తి – భోగాపురం : నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు మండలంలోని పోలిపల్లి గ్రామ సమీపంలోగల భూమాత లేఅవుట్‌లో సోమవారం భూమి పూజ చేశారు. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు ఈ సభను నిర్వహించాలని నిర్ణయించారు. టిడిపి నియోజవర్గం ఇన్‌చార్జ్ కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర టిడిపి నాయకులతో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెంనాయుడు భూమి పూజ చేశారు. సుమారు 5లక్షల మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో ఈ స్థలం అనువుగా ఉంటుందని పార్టీ పెద్దలు నిర్ణయించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాన్‌తో పాటు చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. దీంతో సభకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించారు. ఆ పార్టీ నాయకులు పి. ఆశోక్ గజపతిరాజు, కిమిడి కళా వెంకటరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కోరాడ రాజబాబు, కూన రవికుమార్, పతివాడ నారాయణస్వామి నాయుడు, కొండపల్లి అప్పలనాయుడు, కోండ్రు మురళీ, కిమిడి నాగార్జున, కర్రోతు సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
