మున్సిపల్‌ కార్మికుల ‘సమ్మె’ట

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌ వాడీలు, ఆశా కార్యకర్తలు రోడ్డెక్కారు. అదే బాటలో మంగళవారం నుంచి పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పనిచేసే పారిశుధ్య, ఇతర విభాగాల కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. పుర ఉద్యోగుల సంఘాలు సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నుంచి సమ్మె చేయనుండగా, ఎఐటియుసి అనుబంధం, టిఎన్‌జియుసి, వైఎస్‌ఆర్‌ ట్రేడ్‌యూనియన్‌ జెఎసి ఆధ్వర్యాన సమ్మెకు మద్దతు పలకనున్నారు. ఇప్పటికే ఆయా సంఘాలు నాయకులు కార్మికులు నాయకులు కమిషనర్లకు నోటీసులు ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి విజయనగరం, బొబ్బిలి మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో పురపాలక పారిశుధ్య సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసి నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు ఆందోళన బాట పట్టారు. జూన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమావేశంలోని నిర్ణయాలను నేటి వరకు అమలు చేయలేదు. ఈనేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నగరపాలక, నగర పంచాయతీ, మున్సిపాలిటీల్లో కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు.
ఇవీ డిమాండ్లు….పొరుగు సేవలు, ఎన్‌ఎంఆర్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలి. ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు నెలకు రూ.26 వేలు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం గ్రాట్యుటీ, పింఛను, ఇతర సదుపాయాల కల్పించాలి. ఇంజినీరింగ్‌, గార్బేజీ డ్రైవర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, మలేరియా విభాగాల్లో పనిచేసే కార్మికులకు రిస్క్‌ హెల్త్‌ అలవెన్సులు ఇవ్వాలి. విలీన పంచాయతీల్లో పనిచేసే వారు, కరోనా, వరదల సందర్భంగా విధుల్లోకి తీసుకు న్న వారికి గుర్తింపునివ్వాలి . క్లాప్‌ వాహనదారులకు రూ.18,500 జీతం ,పట్టణాల విస్తీర్ణం మేరకు సిబ్బంది పెంపు, ఉద్యోగ భద్రత, 11వ పిఆర్‌సి ప్రకారం రూ.20 వేల వేతనం చెల్లింపు, కరవు భత్యం వంటి సమస్యలు పరిష్కారం కోసం సమ్మె చేపడుతున్నారు.
ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలి
మున్సిపల్‌ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మున్సిపల్‌ కార్మికులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. అవుట్‌ సోర్సింగ్‌ వారిని పర్మినెంటు చేస్తామని చెప్పి ఆప్కాస్‌లో చేర్చారు. దీంతో ఏటా రెన్యువల్‌ చేయించుకోవాల్సి వస్తోంది. వేతనాలు కూడా పెంచకుండా వేధిస్తున్నారు. వెంటనే వేతనాలు పెంచాలి. లేదంటే సమ్మె విరమించేది లేదు.
– ఎ.జగన్మోహన్‌రావు,ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు

➡️