ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి చేపట్టే మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జగన్మోహన రావు, బి.రమణ కోరారు. నగరంలో స్టేడియంపేటలో ఆదివారం సాయంత్రం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 11వ పిఆర్‌సిలో ఒక్కొక్క కార్మికునికి రూ.8 వేలు వేతనం పెరగాల్సి ఉండగా, రూ.3 వేలు పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులపై పర్యవేక్షణ, పనిభారం పెరిగాయి తప్ప సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఏళ్ల తరబడి రక్షణ పరికరాలు, పనిముట్లు ఇవ్వటం లేదన్నారు. ఆప్కోస్ కారణంగా 60 ఏళ్లు నిండిన వారిని ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండానే ఇంటికి పంపిస్తున్నారని, వారి పరిస్థితి దయనీయంగా ఉందని వాపోయారు. కరోనాలో సైతం తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడిన మున్సిపల్ కార్మికులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరవధిక సమ్మెకు సిద్ధం కావాల్సి వచ్చిందని తెలిపారు. ప్రజలంతా సహకరించి సమ్మెను బలపరచాలని కోరారు. కార్యక్రమంలో కుమారి, రమ, ఈశ్వరమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు.
