117 జిఒ రద్దు పేరుతో తెలుగుకు మంగళం?

Jan 11,2025 20:33

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఏరు దాటకా బోడి మల్లన్న అన్నా చందంగా టిడిపి కూటమి ప్రభుత్వం వైఖరి ఉంది. ఎన్నికల ముందు జీవో 117ను పూర్తిగా రద్దు చేస్తామని, తెలుగు మీడియంను కొనసాగిస్తామని, ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పిన ప్రభుత్వం జీవో 117 రద్దు పేరుతో తీసుకుంటున్న మార్పులు ప్రభుత్వ విద్యారంగాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. పేద విద్యార్థులకు తెలుగు మీడియం చదువుకు దూరం చేసేలా ఉన్నాయని పలువురు విద్యావేత్తలు అంటున్నారు. ప్రధానంగా ఎన్‌సిఇఆర్‌టి కోర్సును ప్రవేశపెట్టడం వల్ల తెలుగు మీడియం రద్దయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో సంస్కరణలు అమలు చేస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117ను రద్దు చేసింది. ఆ జీవో రద్దు చేసినా ఇంచుమించు అవే విధానాలను అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం గతంలో హైస్కూల్లో విలీనం చేసిన 3,4,5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లోకి వెనక్కి వస్తాయి. ఇది శుభ పరిణామమేనని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. ఈలెక్కన గతంలో ఉన్నత పాఠశాలల్లో విలీనమైన ఉమ్మడి జిల్లాలోని 113 ప్రాథమిక పాఠశాలలు తిరిగి గత పాఠశాలల్లో కొనసాగే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రీ హైస్కూలు విధానాన్ని రద్దు చేసి మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ను తీసుకొస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో కూడా 60 మంది విద్యార్థులపైన ఉన్న పాఠశాలలన్నీ మోడల్‌ ప్రైమరీ పాఠశాలలుగా రూపొదిద్దుకుంటే ఈ మోడల్‌ ప్రైమరీ పాఠశాలలను పంచాయతీకి ఒకటి చొప్పున ఉండే పరిస్థితి ఉంది. విద్యార్థులు ఎక్కువ ఉంటే రెండు మోడల్‌ స్కూళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనిబట్టి ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 920 మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల యుపి స్కూల్స్‌ పూర్తిగా రద్దవుతాయి. విద్యార్థుల సంఖ్య 30 కంటే తక్కువగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను మోడల్‌, బేసిక్‌ ప్రైమరీగా మార్చనున్నారు. 6,7,8 తరగతుల విద్యార్థులను దగ్గరలోని పాఠశాలలకు తరలిస్తారు. విద్యార్థుల సంఖ్య 60 కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైస్కూలుగా మార్చనున్నారు. ఈ లెక్కన జిల్లాలో పలు ప్రాథమికోన్నత పాఠశాలలు విలీనం కానున్నాయి. గతంలో యుపి స్కూళ్లలో సబ్జెక్ట్‌ టీచర్స్‌గా స్కూల్‌ అసిస్టెంట్స్‌ ఉండేవారు.వీరంతా తిరిగి హైస్కూల్‌లో విలీనమయ్యే అవకాశం ఉంది. కొందరు ఎస్‌జిటిలు కూడా హైస్కూల్లో పని చేసేవారు, వారిని కూడా వెనక్కి పంపించనున్నారు. ఈసారి జరిగే హేతుబద్ధీకరణలో ఉపాధ్యాయుల స్థానచలనం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. హైస్కూల్‌ ప్లస్‌ను రద్దు చేయడంతో ఆ విద్యార్థులంతా దగ్గరలోని ప్రభుత్వ కళాశాలలకు తరలనున్నారు. జీవో నెంబర్‌ 117 రద్దుకు సంబంధించిన ప్రతిపాదనల వల్ల బదిలీలు, హేతుబద్ధీకరణలో న్యాయపరమైన చిక్కులు ఎక్కువగా వచ్చే అవకాశముందని విద్యావేత్తలు అంటున్నారు. ముఖ్యంగా పంచాయతీకి ఒక మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ప్రతిపాదన వలన పంచాయతీలో చుట్టుపక్కల ఉన్న అనుబంధ గ్రామాల విద్యార్థులు ఆ మోడల్‌ స్కూల్లో జాయిన్‌ అవుతారా? లేదా ప్రైవేట్‌ స్కూల్‌కు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది. ప్రభుత్వం కొత్తగా అన్ని తరగతులకూ ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌ను ప్రవేశపెట్టడంతో తెలుగు మీడియం రద్దయ్యే అవకాశం ఉంది.
జీవో 117 రద్దయినట్లేనా?
3,4,5 తరగతులను హైస్కూల్స్‌ నుంచి వేరుచేసి ప్రాథమిక పాఠశాలల్లో కలిపినంత మాత్రాన జీవో 117 రద్దు అయినట్లు కాదు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే కొనసాగాలి. హైస్కూల్స్‌లో సమాంతర మాధ్యమం కొనసాగాలి. యుపి స్కూల్స్‌ను ఉంచాలి. హైస్కూల్స్‌లో ప్లస్‌ 2 కూడా కంటిన్యూ చేయాలి. ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ బడులను బలోపేతం చేసే విధంగా ఉండాలి. -డి రాము. యుటిఎఫ్‌ రాష్ట్ర విద్యా సబ్‌ కమిటీ సభ్యులు.
సమాంతర విద్యను అమలు చేయాలి
ప్రభుత్వ విద్యారంగంలో తెలుగు,ఇంగ్లీష్‌ మీడియంలు రెండింటినీ సమాంతరంగా అమలు చేయాలి. తెలుగు మీడియంలో విద్య కొనసాగింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా బలవంతంగా ఇంగ్లీష్‌ మీడియంను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. దీనిని మేము వ్యతిరేకిస్తున్నాం.  – డి.శ్యామ్‌, ఎస్‌టియు రాష్ట్ర నాయకులు
కొత్త సీసాలో పాత సారా చందానా ఉంది
విద్యాశాఖ జీవో నెంబర్‌ 117ను రద్దు చేయడం సంతోషమే. కానీ ఈ నూతన ప్రతిపాదనలో లేదా డ్రాఫ్ట్‌ కొత్త సీసాలో పాతసార చందాన ఉంది. ముఖ్యంగా ఉన్నత పాఠశాలలో తెలుగు మీడియంతో ఇంగ్లీష్‌ మీడియం కూడా సమాంతరంగా సాగించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలను విశ్లేషిస్తే ఉపాధ్యాయుడికి భారం ఎక్కువగానే ఉంది. కావున ఈ డ్రాఫ్ట్‌ను మార్చవలసిన అవసరం ఉంది. హైస్కూళ్లు దూరంగా ఉన్న ప్రాంత్లాల్లో యుపి స్కూళ్లను కొనసాగించాలి. -డి.ఈశ్వరరావు, ఎపిటిఎఫ్‌ (1938) రాష్ట్ర ఉపాధ్యక్షులు

➡️