అభివృద్ధి పనులకు రూ.20 లక్షలు

Nov 29,2024 21:44

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలో అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.20 లక్షల మేరకు కేటాయిస్తున్నట్లు మేయర్‌ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో 47 అంశాలకు ఆమోదం లభించింది. వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చారు. స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఎస్‌వివి రాజేష్‌ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. ప్రజలకు మంచి పాలన అందించడమే అందరి ధ్యేయమని పునరుద్ఘాటించారు. అనంతరం మేయర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ అందరి సహకారంతో నగర అభివృద్ధి సాధ్యమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నగరంలోని 50 డివిజన్లకు రూ.20 లక్షల చొప్పున అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాధాన్యత క్రమంలో ఆయా నిధులతో పనులు చేపట్టే వెసులుబాటు ఉందన్నారు. సమావేశంలో కమిషనర్‌ పల్లి నల్లనయ్య, సహాయ కమిషనర్‌ సిహెచ్‌ తిరుమల రావు, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు అల్లు చాణక్య, సుంకరి నారాయణస్వామి, రేగాన రూపాదేవి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️