ఎస్‌ఐ, యువకుల మధ్య ఘర్షణ

Mar 12,2025 21:50

ప్రజాశక్తి-వేపాడ : మండలంలోని గుడివాడలో శ్రీ వేణుగోపాల స్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన డ్యాన్సుబేబి డ్యాన్సు సందర్భంగా వల్లంపూడి ఎస్‌ఐ బి.దేవిపై తిరగబడిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీర్థ మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో స్టేజ్‌ ముందు యువకులు డ్యాన్సు చేశారు. అక్కడికి వెళ్లిన ఎస్‌ఐ దేవి యువకులను అదుపు చేసేందుకు చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు యువకులకు గాయాల య్యాయి. దీంతో వారంతా ఎస్‌ఐపై తిరగబడ్డారు. కార్యక్రమాన్ని తిలకిస్తున్న తమను ఎందుకు కొట్టారంటూ గట్టిగా నిలదీశారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారు లకు ఎస్‌ఐ సమాచారం ఇవ్వడంతో రూరల్‌ ఎస్సై అప్పలనాయుడు, ఎల్‌ కోట, కొత్తవలస పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐలుతో పాటు సుమారు 30 మంది సిబ్బంది వాహనాలపై రాత్రి ఆ గ్రామానికి చేరుకున్నారు. యువకులను గుర్తించి ఎల్‌.కోట స్టేషన్‌కు తరలించి, అక్కడ విచారిస్తున్నారు. గ్రామంలో ఘర్షణలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. నాపై దాడి చేసి, అభస్యకరంగా ప్రవర్తించారు : ఎస్‌ఐ దేవి గ్రామంలో డ్యాన్సుబేబి డ్యాన్సు కార్యక్రమం జరుగుతుండగా, బందోబస్తు కోసం వెళ్లిన తనపై కొందరు యువకులు దాడి చేసి, అసభ్యకరంగా ప్రవర్తించారని వేపాడ ఎస్‌ఐ బి.దేవి ఎస్‌.కోట సిఐకు ఫిర్యాదు చేశారు. డ్యాన్సు చేస్తున్న యువతుల వద్దకు గ్రామానికి చెందిన యువకులు గుడివాడ మోహన్‌ పదేపదే వెళ్లి అభస్యకరంగా వ్యవహరించాడని, ప్రశ్నించిన తనను అసభ్యపద జాలంతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా మోహన్‌తో పాటు అతని స్నేహితులు గుడివాడ సంతోష్‌కుమార్‌, విష్ణుదుర్గ, హర్ష, ఎర్నిబాబు, గౌరినాయుడు తనపైకి వచ్చి దుర్భాషలాడారని, తనను కొట్టి, జట్టు పట్టుకొని లాగారని, తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనను వీడియో తీస్తుండగా తన సెల్‌ఫోన్‌ పట్టుకొని పారిపోయారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఎస్‌.కోట సిఐ షణ్ముఖరావు 9మంది యువకులను అరెస్టు చేసి కొత్తవలస కోర్టులో హాజరు పరిచారు.

➡️