ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం మున్సిపాల్టీ మురికినంతా శుభ్రం చెయ్యడం, ప్రజల కనీస అవసరాలైన మంచినీరు, కరెంట్ తదితర సేవలు చేస్తూ గత 25 ఏళ్ళుగా బ్రతుకుతున్నాము. మేము నిత్యం విషవాయువులను పీల్చుకొని పనిచేస్తున్నాము. మాసేవల మూలంగా పట్టణాలు పరిశుభ్రంగా ఉంటున్నాయి, ప్రజారోగ్యం, పర్యావరణం పరిరక్షించబడుతున్నాయి. కరోనా సమయంలోనూ, గతంలో విశాఖ హుదూద్ తుఫాను, ఇటీవల విజయవాడ వరదల ముంపు ప్రాంతాలలో మాపట్టణం నుండి వెళ్ళి ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించాము. మేము చేస్తున్నపని అపాయకరమైనది. అంతేకాక శాస్వత స్వభావం కలిగినది. ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న మమ్మల్ని ఆప్కాస్, ప్రైవేట్ ఏజెన్సీ ల పేరుతో నిత్యం అభద్రతతో కూడిన ఉద్యోగులుగా చేయడం ఏమాత్రం సమంజసం కాదు తక్షణమే కార్మికులను పర్మినెంట్ చేసి, అప్కాస్ లో చెప్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్, ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఏ.జగన్మోహనరావులు డిమాండ్ చేశారు.
బుధవారం స్థానిక ఎల్ బి జి భవనంలో ఏర్పాటు విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు.ముందుగా ఎపి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కు రాసిన లేఖను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేందుకు మేము పస్తులుండి కూడా పనిచేస్తున్నామన్నారు. మా సేవలకు “ఫ్రంటైన్ వారీయర్స్”, “దేవుళ్ళు” అని పొగడటం జరిగిందన్నారు. అలాగే “మా వారి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుంటున్నారు” తప్పా మా శ్రమకు నిజమైన గుర్తింపు ఇవ్వడంలేదన్నారు.
ప్రస్తుతం ఆప్కాస్ ద్వారా ప్రతి నెలా ఒకటవ తేది మా చేతికి జీతం గ్యారంటీగా వస్తుంది. జీతాల చెల్లింపులో ఏవిధమైన కోతలు ఉండటం లేదు. పిఎఫ్, ఇఎస్ఐ, వాటా నిధులు సక్రమంగా మా ఖాతాలలో జమ అవుతున్నాయన్నారు. ఎటువంటి వేదింపులు, బెదిరింపులు లేవు. కాని గత వైసిపి ప్రభుత్వం ఉద్యోగాలు మాత్రం పర్మినెంట్ చెయ్యలేదన్నారు. ఆప్కాస్ లో మమ్మల్ని ఉద్యోగులుగా నమోదుచేసి సంక్షేమపథకాలు లేకుండా చేసింది. 60 ఏళ్ళకు బలవంతంగా రిటైర్మెంట్ చేసింది. మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రస్తుతం తమ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆప్కాస్ తొలగించి ప్రైవేట్ ఏజెన్సీలకు మమ్మల్ని అప్పగించే ప్రయత్నాలలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రైవేట్ ఏజెన్సీలు మమ్మల్ని వేదించుకు తింటాయి. మా జీతం మా చేతికి గ్యారంటీగా వస్తుందనే నమ్మకంలేదు. పిఎఫ్. ఇఎస్ఐ డబ్బులు సక్రమంగా ఖాతాలలో జమకావు. నిత్యం వేదింపులు, బెదిరింపులు, అక్రమ తొలగింపులు పెరిగి మేము అవస్థలు పడాల్సి వస్తుందన్నారు.
కావున మంత్రి స్పందించి ఆప్కాస్, ప్రైవేట్ ఎజెన్సీలు కాకుండా తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేసి తమ కుటుంబాలకు న్యాయం చెయ్యాలని కోరుతున్నామన్నారు. విలేకర్ల సమావేశంలో యూనియన్ నాయకులు బి.భాస్కరరావు విలేకర్ల సమావేశంలో కార్మికులు పాల్గొన్నారు.
