మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలపైదశల వారీగా పోరుబాట

Sep 29,2024 20:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మున్సిపల్‌ ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటం చేయనున్నట్లు యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం యుటిఎఫ్‌ ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నగరంలోని పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని రకాల సదుపాయాలను మున్సిపల్‌ టీచర్లకు కల్పించాలని దీర్ఘకాలిక పోరాటాలు చేశామని గుర్తుచేశారు. పిఎఫ్‌, అప్‌గ్రేడ్‌, ప్రమోషన్లు, బదిలీల సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయని, వీటిని తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎజి, డిఎంఎ.. ఒకరిపై మరొకరు నెట్టుకుంటూ మున్సిపల్‌ టీచర్ల పిఎఫ్‌ సమస్యను జాప్యం చేస్తున్నారని తెలిపారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించి, ప్రస్తుతం మున్సిపల్‌ శాఖ ఖాతాలో ఉన్న పిఎఫ్‌ డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పిఎఫ్‌, అప్‌గ్రేడేషన్‌ ఇతర సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్‌ రెండో తేదీన అన్ని మున్సిపాలిటీల్లో సత్యాగ్రహ దీక్షలు చేస్తామని తెలిపారు. అప్పటికి రాష్ట్ర విద్యాశాఖ స్పందించకుంటే అక్టోబరు 17న జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు, 24న రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయం వద్ద 24 గంటల ధర్నా చేపడతామని హెచ్చరించారు. అనంతరం యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు ఆర్‌.మోహన్‌రావు, ఎస్‌.కిశోర్‌ కుమార్‌, వి.శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జిఒ 3ను పునరుద్ధరిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తక్షణమే ఆ జిఒను పునరుద్ధరించి, గిరిజన హక్కుల్ని కాపాడాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మాధ్యమాలను కొనసాగించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.మున్సిపల్‌ టీచర్ల సమస్యలపై వినతి మున్సిపల్‌ టీచర్ల సమస్యలపై యుటిఎఫ్‌ ఆధ్వర్యాన డిఇఒ ప్రేమ్‌కుమార్‌కు ఆదివారం వినతి అందించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు జెఆర్‌సి పట్నాయక్‌, జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, జిల్లా కార్యదర్శులు ఎన్‌.సత్యనారాయణ, సిహెచ్‌ తిరుపతినాయుడు విజయనగరం మున్సిపల్‌ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.వెంకటరావు, పి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️