వసతిగృహ సిబ్బందిపై చర్యలు

Feb 5,2025 21:35

ప్రజాశక్తి-విజయనగరంకోట : బాలికల వసతిగృహంలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై విచారణ చేపట్టి, అక్కడి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు ఆదేశించారు. విజయనగరంలోని సుంకరివీధిలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహంలో కలుషిత ఆహారం తీసుకొని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆయన బుధవారం పరామర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌, మిషన్‌ వాత్సల్య సిబ్బందితో కలిసి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ రెండు వారాలుగా విద్యార్థులు ఆహారం విషయాల్లో ఇబ్బంది పడుతున్నట్లు తన దృష్టికి తీసుకురావడంతో వసతిగృహ అధికారులు, సిబ్బందిని హెచ్చరించినట్లు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వసతిగృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడినట్లు చెప్పారు. ఇటువంటి సంఘటనలు, ఫిర్యాదులు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించినట్లు గుర్తుచేశారు. అదే రోజు సాయంత్రం సిబ్బంది నిర్లక్షం వల్ల ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని తెలిపారు. అనంతరం తెర్లాం మండలంలో తొమ్మిదో తరగతి విద్యార్థి పురుగులు మందు తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆయన పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అప్పలనాయుడు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామానుజం, జిల్లా బాలల సంరక్షణ అధికారి భీంపల్లి లక్ష్మి, మిషన్‌ వాత్సల్య, సిబ్బంది యాళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️