ఇళ్ల నిర్మాణాలకు అదనపు సాయం

Apr 13,2025 21:11
  • వివిధ దశల్లో 23,700 ఇళ్లు
  • రాక్రిడ్‌ స్థానంలో వేరొక నిర్మాణ సంస్థకు సన్నాహాలు
  • కొత్త ఇళ్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ
  • గృహ నిర్మాణానికి ప్రభుత్వ ప్రాధాన్యత
  • ‘ప్రజాశక్తి’తో హౌసింగ్‌ పీడీ మురళీ మోహన్‌

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అదనపు సాయం అందిస్తోందని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.మురళీమోహన్‌ అన్నారు. ఇప్పటికే 5,310 మంది లబ్ధిదారులు ఈ రకమైన సాయాన్ని అందుకున్నారని స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలన్నీ ఇటీవల ఊపందుకున్నాయని, వివిధ దశల్లో 23,700 ఇళ్లు ఉన్నాయని తెలిపారు. గుంకలాం, కొండకరకాం లేఅవుట్లలో రాక్రిడ్‌ నిర్మాణ సంస్థ స్థానంలో వేరొక నిర్మాణ సంస్థకు నిర్మాణ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వివరించారు. కొత్త ఇళ్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరణ స్వీకరిస్తున్నామని, ఆదేశాలు రాగానే మంజూరు ప్రక్రియ చేపడతామని అన్నారు. గడిచిన పది నెలల కాలంలో గృహ నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని, ఇక ముందు మరింతగా ఉంటుందని, దీన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు. ఈ వారం తనను కలిసిన ప్రజాశక్తికి ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు…
ప్రస్తుతం గృహ నిర్మాణం ఎలా జరుగుతోంది.?
గత ప్రభుత్వ హయాంలో జిల్లా వ్యాప్తంగా 81,999 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 70,873 వరకు నిర్మాణాలు ప్రారంభం కాగా, మిగిలిన 11,126 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రారంభమైన వాటిలో 47,173 వరకు పూర్తికాగా, 1518 ఇళ్లు స్లాబు దశలో ఉన్నాయి. మిగిలిన 22,182 వివిధ దశల్లో ఉన్నాయి.
ఇళ్ల పట్టాల్లో ఎన్ని గృహ నిర్మాణాలు చేపడుతున్నారు.?
జిల్లా వ్యాప్తంగా చేపట్టిన మొత్తం 81,999 ఇళ్లలో 46,802 మంది లబ్ధిదారులు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లోనూ, మిగిలినవి సొంత స్థలాల్లోనూ నిర్మాణాలు చేపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులందరికీ రూ.1.80 లక్షలు చొప్పున మంజూరయ్యాయి. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈనేపథ్యంలో నెలవారి ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం.
లబ్ధిదారులను ఎలా ప్రోత్సహిస్తున్నారు.?
గతంలో ఇచ్చిన సాయం సరిపోవడం లేదనే లక్ష్యంతో అదనంగా బిసిలకు రూ.50 వేలు, ఎస్‌సి, ఎస్‌టిలకు రూ.75 వేలు, ఆదివాసీలకు రూ.లక్ష చొప్పున అదనంగా ప్రభుత్వం మంజూరు చేస్తోంది. దీంతో లబ్ధిదారులు గృహ నిర్మాణాలు పూర్తిచేసేందుకు ముందుకు వస్తున్నారు.
ఇప్పటి వరకు సాయం ఏమైనా అందిందా.?
అందింది… జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15,496 మంది లబ్ధిదారులకు గృహనిర్మాణ అదనపు సాయం మంజూరైంది. ఇప్పటి వరకు 5,310 మందికి సుమారు రూ.8 కోట్ల మేర నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. మిగిలినవారు కూడా నిర్మాణాలు పున:ప్రారంభిస్తున్న నేపథ్యంలో వారికి కూడా అదనపు సాయం అందుతుంది.
గుంకలాంలో లేఅవుట్‌లో నిర్మాణాలు ఎంతమేరకు చేపట్టారు.?
విజయనగరంలోని గుంకలాం లేఅవుట్‌ రాష్ట్రంలోని అతిపెద్ద లేఅవుట్లలో ఒకటి. ఇక్కడ 10,139 మందికి ఇళ్ల స్థలాలను ప్రభుత్వం ఇచ్చింది. దీనికి సమీపంలోనే కొండకరకాం లేఅవుట్‌లో మరో 2,289 మందికి ఇచ్చారు. మొత్తం 12,428లో 49 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా, మరో 147 ఇళ్లు పైకప్పు వరకు వచ్చాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇక్కడ రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, తదితర సదుపాయాలు కల్పిస్తున్నాం.
మూడో పద్ధతి ఇళ్ల నిర్మాణం ఎంత వరకు వచ్చింది.?
జిల్లాలో ముఖ్యంగా గుంకలాం, కొండకరకాం లేఅవుట్ల పరిధిలో మాత్రమే ప్రభుత్వం ఇళ్లు నిర్మించాలన్న మూడో పద్ధతిలో లబ్ధిదారులు ముందుకు వచ్చారు. వీటి నిర్మాణానికి పలు నిర్మాణ సంస్థలతో నాటి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా కాంట్రాక్టర్లు చాలా వరకు పూర్తిచేయలేదు. ఇందులోనూ ప్రధానంగా రాక్రిడ్‌ అనే నిర్మాణ సంస్థ పరిధిలో సుమారు 6 వేలకు పైగా ఇళ్లు ఉన్నాయి. పనిలో లోపాలతోపాటు అసంపూర్తిగా వదిలేయడం వల్ల ప్రస్తుతం ఆ సంస్థ స్థానంలో వేరొక నిర్మాణ సంస్థను పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. త్వరలోనూ నిర్ణయం జరుగుతుంది. వాటని ప్రభుత్వమే నిర్మించి ఇళ్లను అప్పగించాలన్న ఆలోచనలో ఉంది.
ఇళ్ల నిర్మాణాలకు కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారా.?
ఔను! ఇప్పటి వరకు ఇళ్ల మంజూరు చేపట్టకున్నా, ఇళ్లు లేని పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. అందుకే తొలి ప్రాధాన్యతలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను ముందుకు తీసుకెళ్లేందుకు అదనపు సాయం ప్రభుత్వం అందిస్తోంది. కొత్త ఇళ్ల మంజూరు కోసం కొంతకాలంగా ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. గ్రామ సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ సాగుతోంది. అనుమతులు రాగానే మంజూరు ప్రక్రియ ప్రారంభమౌతుంది.

➡️