ఇజనారానికి ఏట్నేదురా..!

Jan 11,2025 20:42

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ‘ఇంతోటి బతుకూ ఇల్లాకాతలకే…! అన్నట్టుగా ఉందిరా మోడీ మాటలు. ఇంత కష్టపడి ఇశాకపట్నం వచ్చామా? సలి సూడు ఎలాగా వంచేత్తాంది…. అట్నుంచి బయలుదేరినప్పుడు బాగానే ఉందిగానీ, ఇప్పుడు సూడు ఆ మోడీ మన ఇజనారం గురించి ఒక్కమాట కూడా ఆడలేదు. మనం మాత్రం మన నాయకుల మాటలు నమ్మేసి ఎగోసుకుని వచ్చీనాము.’ ఇది నాలుగు రోజుల క్రితం విశాఖలోని మోడీ సభకు వెళ్లొచ్చిన మన జిల్లా వాసుల నోట వినిపిస్తున్న మాటలు. పాపం… ఓ వైపు నాయకుల పోరు భరించలేక… మరోవైపు ఏదో పొరుగునే ఉన్న మన ఇజానారం కోసమూ మాట్లాడకపోతారా? కనీసం విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌పైనైనా ఒక క్లారిటీ ఇవ్వకపోతారా? అంటూ భావించినవారికి నిరాశే ఎదురైంది. ఇందుకు కారణం లేకపోలేదు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్లు ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఐదు కాదు… తాము అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని నమ్మబలికారు. అంతే కాదు… విభజన చట్టంలోవున్న వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. హోదా ఎలాగూ ఇవ్వలేదు. కనీసం ప్రత్యేక నిధులైనా కేటాయిస్తే మన జిల్లా ఎంతోకొంత అభివృద్ధి చెందేది. ఆ మాత్రం సాయం కూడా చేయలేదు. ‘ఇవన్నీ తెలియనివి కాకపోయినప్పటికీ, మోడీ విశాఖ రావడం, ఆయన సభకు వందల ఆర్టీసి బస్సులు మళ్లించడం, ఇవిచాలవన్నట్టు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను కూడా జనాన్ని తరలిచేందుకు ఉపయోగించడం, అందుకోసం ఏకంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు అనధికారికంగా సెలవు ఇచ్చేయడంతో మన జిల్లా అభివృద్ధికి కేంద్రం ఏదో చేస్తుందని ఆశపడ్డామని, ఆ ఆశలన్నీ సభలోనే ఆవిరిగా మిగిలిపోయాయని జనం చర్చించుకుంటున్నారు. అభివృద్ధి సంగతి పక్కనబెడితే పదేళ్లగా కేంద్రంలో వెలగబెడుతున్న బిజెపి ప్రభుత్వం జిల్లాకు చేసిందేమీ లేదు సరికదా వివక్ష చూపుతోందని జనం చర్చించుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టే విభజన హామీలో భాగంగా మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఐదేళ్లు పట్టగా, నిధులు మంజూరు చేసి నిర్మాణాలు మొదలు పెట్టడానికి మరో ఐదేళ్లు సాగింది. ఇప్పటికీ ఆ నిర్మాణ పనులు పునాదుల స్థాయిలోనే ఉండడంతో వర్శిటీ తరగతులు పరాయి పంచల్లో సాగుతున్నాయి. జిల్లా పరిధిలోగల మూడవ రైల్వే లైను నిర్మాణ పనులు నత్తనకడకన సాగుతున్నాయి. మానాపురం, చీపురుపల్లి తదితర చోట్ల చేపట్టిన ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాల్లో పురోగతి లేదు. ఇటువంటి చోట్ల ప్రయాణికుల అవస్థలు జిల్లా వాసులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అధికారంలోకి రాకముందు విజయనగరం రైల్వే స్టేషన్‌ను మోడల్‌గా తీర్చిద్దుతామన్న మాటలు నేడు వినిపించకుండా పోయాయి. రైలు మార్గానికి అనుసంధానంగా తలపెట్టిన మామిడి మార్కెట్‌ యార్డు కాగితాలకే పరిమితమైంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంటే కేవలం విశాఖపట్నం మాత్రమే కాదు సుమా..! మన జిల్లాకు చెందినవారు వేల సంఖ్యలో అందులో ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్టు వర్కర్స్‌, చిన్న చితక కాంట్రాక్టర్లుగా ఉన్నారు. ఈ రకంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మన జిల్లాకు ఎంతో అనుబంధం, ఆర్థిక సంబంధం ఉంది. ఇటువంటి ప్లాంట్‌ను బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విదేశీ ప్రైవేటు సంస్థకు విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో మోడీ ఏదో చేస్తారని ఆశతో వెళ్లిన వారు పుట్టెడు నిరాశతో ‘అనవసరంగా వచ్చాము’ అంటూ చర్చించుకోవడం వినిపిస్తోంది.

➡️