ఒప్పందాలు అమలు చేయాలి

Apr 15,2025 21:25

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ఇటీవల కార్మిక శాఖ అధికార్లు వద్ద చేసుకున్న ఒప్పందాలు అమలు చేయాలని జ్యూట్‌ మిల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కిల్లంపల్లి రామారావు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన స్థానిక జ్యూట్‌ మిల్‌ గేటు వద్ద కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యూట్‌ యాజమాన్యం గత ఫిబ్రవరి 10న కార్మిక శాఖ అధికారుల వద్ద కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా గత ఆగస్టు, ఈ ఏడాది ఫిబ్రవరిలో అమలు జరిగిన డిఎ ప్రకారం కార్మికులకు వేతనాలు చెల్లించాలన్నారు. గతంలో జ్యూట్‌ యాజమాన్యం 2016 రిటైర్డ్‌ కార్మికులకు గ్రాడ్యూటీ చెక్‌లు ఇవ్వగా వాటిలో ఒకటి మాత్రమే చెల్లు బాటై మిగతా చెక్‌ లు చెల్లకుండా పోయాయని, వాటికి వెంటనే నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2023-24 రిటైర్డ్‌ కార్మికుల నుంచి జ్యూట్‌ యాజమాన్యం వసూలు చేసిన ప్రభుత్వానికి చెల్లించాల్సిన పిఎఫ్‌, ఈఎస్‌ఐ బకాయిలు వెంటనే చెల్లించి రిటైర్డ్‌ కార్మికులకు పింఛన్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పనకు చర్యలు తీసులోవాలని కోరారు. 2016 నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్‌ కార్మికులు సుమారు 1200మంది ఉన్నారని వారికి నెలకు 30మందికి చొప్పున గ్రాడ్యూటీ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలు పరిష్కరించకపోతే జ్యూట్‌ యాజమాన్యంపై కార్మికులతో కలిసి పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పలువురు కార్మికులు పాల్గొన్నారు.

➡️