బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్

Apr 14,2025 10:16 #Vizianagaram district

మేయర్ విజయలక్ష్మి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరి హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయారని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ పల్లి నల్లనయ్య తో కలిసి ఆమె పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త గా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన సేవలు రాజ్యాంగబద్ధంగా దేశ ప్రజలు సుఖ సంతోషాలతో నిలవడానికి కారణంగా నిలిచాయన్నారు. కడు పేదరికంలో జన్మించి కొలంబయో, లండన్ వంటి దేశాలలో ఉన్న విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించి భారత దేశపు తొలి న్యాయ మంత్రిగా ఆయన మరువలేని సేవలను అందించారన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చిన్ననాటి నుంచి పోరాట బాటను పట్టారన్నారు. సమ సమాజ స్థాపనకు తన రాజ్యాంగం మాత్రమే దిక్సూచిగా నిలవగలదని నమ్మిన ఆయన దేశ గమనానికి మంచి బాటలు వేశారన్నారన్నారు. కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ దేశ ప్రజలలో చెరగని ముద్రను వేసుకున్నారన్నారు. అటువంటి మహానుభావుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పాటుపడాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు, టిపిఆర్ఓ సింహాచలం, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️