విజయనగరం ప్రతినిధి: ‘పుండు ఒక చోట ఉంటే, మందు మరో చోట వేసినట్టుగా ఉంది ధాన్యం కొనుగోలుపై జిల్లాలో అధికార యంత్రాంగం అనుసరిస్తున్న తీరు. ఇక ప్రజాప్రతినిధులకు ఎలాగూ పట్టింపులేదు. దీంతో, అన్నదాత అన్యాయానికి గురౌతున్నాడు’. ఇది కొద్దిరోజులుగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో వినిపిస్తున్న పబ్లిక్ టాక్. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో అధికారుల తీరుపై రైతాంగం ఒకింత అసహనం వ్యక్తమౌతోంది. అసలు విషయం పక్కకు నెట్టేసి, ఆకస్మిక తనిఖీల పేరిట హడావుడి చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని కొందరు, తీసుకెళ్లిన ధాన్యానికి ట్రక్ షీట్లు జనరేట్ చేయడం లేదని మరికొందరు, విక్రయించిన ధాన్యానికి సంబంధించి ట్రాన్స్‌పోర్టు, హమాలీ ఛార్జీలు తమకు చెల్లించలేదని ఇంకొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు గోనె సంచులకూ డబ్బులు ఇవ్వలేదంటున్నారు. దీనిపై రైతులను కలిసి, వాస్తవాలను తెలుసుకుని కొనుగోలుకు, రసీదులకు, హమాలీ, రవాణా ఛార్జీలు, గోనెసంచుల డబ్బులు చెల్లింపునకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు (జిల్లా జాయింట్ కలెక్టర్, సివిల్ సప్లరు డిఎం) ధాన్యం మిల్లులను మాత్రమే తనిఖీ చేస్తున్నారు. అక్కడ ఉన్న స్టాక్‌ను, రికార్డులను పరిశీలించినట్టు ప్రకటనలు గుప్పిస్తున్నారు. అమ్మపుట్టినిల్లు మేనమామకు తెలియదా? అన్నట్టుగా మిల్లులకు అధికారులు వస్తే ఎలాంటి విషయాలు పరిశీలిస్తారో? వాటిని ఏమేరకు పరిగణనలోకి తీసుకుంటారో తెలియదా? అని జనం చర్చించుకుంటున్నారు. వచ్చిన ప్రతి గింజా మిల్లుకు తీసుకుంటున్నట్టు చెప్పడం, వాటికి లెక్కలు చూపించడం మిల్లర్లకు కొత్త కాదు. ఇక్కడ సమస్యేమంటే రైతులకు సంబంధించిన ధాన్యం జిల్లాలోని దాదాపు అన్ని మిల్లుల్లోనూ ఉన్నాయి. వాటికి ట్రక్ షీట్లు ఎప్పటికప్పుడు ఎందుకు ఇవ్వలేదు. ఇటువంటి సందర్భాల్లో ఎక్కడైనా, ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటున్నారా? అంటే అటువంటిదేమీ లేదనే సమాధానం వినిపిస్తోంది. ఈనేపథ్యంలో రైతుల వద్దకు వెళ్తే, ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలుకు ఎన్నాళ్లుగా కాలయాపన జరుగుతోందో? రైతులు గోనె సంచులకోసం పడుతున్న అవస్థలేమిటో, ఛార్జీలు చెల్లించక వారు నష్టపోతున్న పరిస్థితి ఎలా ఉందో అర్థమౌతుంది. ఇటువంటి ప్రయత్నమేదీ అధికారులు చేయలేదంటూ రైతులు అంటున్నారు. పైగా జిల్లాలో ఈ ఏడాది 2,43,400 ఎకరాల్లో వరి సాగైంది. తద్వారా 4,97,614 మెట్రిక్ టన్నుల మేర ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో సుమారు 47వేల మెట్రిక్ టన్నుల మేర తిండికిపోగా రైతులు 4.50లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం విక్రయించేందుకు అవకాశం ముందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో నడిచే సివిల్ సప్లై విభాగం మాత్రం 3.20లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలుకు మాత్రమే లక్ష్యంగా తీసుకుంది. ఇందులో 3,13 మెట్రిక్ టన్నుల (98శాతం) మేర కొనుగోలు చేసినట్టు గత నెలాఖరు నాటికే చిట్టాలు తయారు చేశారు. అదే గనుక నిజం అయితే, రైతుల వద్ద ప్రస్తుతం ధాన్యం ఎందుకు ఉండిపోతాయి. దీన్నిబట్టి మిల్లర్లు పిడిఎస్ బియ్యాన్ని లెక్క చూపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీన్నిబట్టి అధికారులు క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు మిల్లులను మాత్రమే ఎందుకు పరిశీలిస్తున్నారన్నదానిపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
