రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు

Jan 9,2025 20:58

ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు, రవాణా, జాతీయ రహదారుల సంస్థలతో కలసి పకడ్బందీ చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చెప్పారు. రహదారులపై తరచుగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, నివారించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చర్యలు చేపడతామన్నారు. గుర్తుతెలియని వాహనాలు ఢకొీన్న ఘటనల్లో గాయపడిన, మరణించిన వారికి సహాయం అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ రహదారులపైనే ఈ తరహా కేసులు అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు వివరించారు. గొట్లాం వద్ద జాతీయ రహదారి కూడలిలో తగినంత వెలుతురు లేకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం కలుగుతోందని అధికారులు తెలిపారు. జిల్లాలో ప్రతి నెలా సగటున ఆరు నుంచి ఏడు గుర్తు తెలియని వాహనం ఢకొీన్న కేసులు నమోదవుతున్నట్టు చెప్పారు. గుర్తుతెలియని వాహనం ఢకొీని గాయపడిన లేదా మరణించిన ఘటనల్లో బాధితులకు నెల రోజుల్లోగా పరిహారం అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో నలుగురు బాధితులకు ఆర్ధిక సహాయం అందించేందుకు ఆమోదించారు. ఈ ఘటనల్లో మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందిస్తూ ప్రభుత్వం జిఒ జారీ చేసినట్లు డిఆర్‌ఒ ఎస్‌.శ్రీనివాసమూర్తి తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ సభ్యుడు మజ్జి అప్పారావుకు చెందిన రోడ్‌ సేఫ్టీ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలపై రూపొందించిన బ్యానర్‌ను, రోడ్డుభద్రతపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన ప్లకార్డ్‌ ను కలెక్టర్‌ అంబేద్కర్‌, అదనపు ఎస్‌పి సౌమ్యలత, డిఆర్‌ఒ శ్రీనివాసమూర్తి, ఆర్‌డిఒలు, డిఎస్‌పిలు ఆవిష్కరించారు. సమావేశంలో రెవిన్యూ డివిజనల్‌ అధికారులు రామ్మోహన రావు, సత్యవాణి, కీర్తి, విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి డిఎస్‌పిలు శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, రాఘవులు, జిల్లాస్థాయి కమిటీ సభ్యులు మజ్జి అప్పారావు, యునైటెడ్‌ ఇండియా ఇన్స్యూరెన్స్‌ కంపెనీ పరిపాలన అధికారి పి.వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️