ప్రజాశక్తి-విజయనగరంకోట : జిల్లాలో ప్రత్తి రైతుల జాబితాను సిద్ధం చేసి, కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. ప్రత్తికొనుగోలు ప్రక్రియను ప్రారంభించేందుకు తన ఛాంబర్లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, జిల్లాలో నవంబరు రెండో వారం నుంచి ప్రత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, ఆ లోగా వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాజాం, రామభద్రపురంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీరైతు తాము పండించిన ప్రత్తిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, కనీస మద్దతు ధరను పొందేలా చూడాలని జెసి కోరారు. దీనికోసం ప్రత్తి రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల వారీగా ముందుగానే సిద్దం చేయాలని సూచించారు. సమావేశంలో మార్కెటింగ్‌శాఖ ఎడి బి.రవికుమార్, జిల్లా అగ్నిమాపకాధికారి బి.రామ్‌ప్రకాష్, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ పివి రంగారెడ్డి, వ్యవసాయశాఖ ఎడి అన్నపూర్ణ, మోటార్ వెహిల్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
