ప్రజాశక్తి- గజపతినగరం : గజపతినగరంలో స్కూల్లో పనిచేసే ఆయాలకు మూడు నెలలుగా బకాయి ఉన్న వేతనాలను చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి. లక్ష్మి అన్నారు. ఆదివారం పాఠశాల వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 15 సంవత్సరాల నుంచి స్కూల్లో ఆయాలుగా పని చేస్తున్న కార్మికులకు రూ.6వేలు జీతం ఇస్తున్నారన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్కూలు దగ్గర ఉండి పని చేయాల్సి వస్తున్నా నెల నెలా జీతం సకాలంలో చెల్లించడం లేదన్నారు. దీంతో అప్పుల పాలై కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టంగా ఉందని, విద్య వైద్యం, ఇతర అవసరాలకు డబ్బులు సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెరిగిన ధరలకనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిచోట్ల రాజకీయ వేధింపులు పెరిగాయని మండలంలోని రామన్నపేట గ్రామంలో ఆయాగా పనిచేస్తున్న వెలగాడ జానకినీ వారం రోజుల నుంచి పనిలోకి రావద్దన్నారని సర్పంచ్ తల్లి ఎమ్మెల్యేతో ఫోన్ చేయించారని చెబుతున్నారని దీంతో ఆమె పరిస్థితి చాలా ఆందోళన కరంగా ఉందని గుర్తు చేశారు. రాజకీయ వేధింపులు తక్షణమే ఆపకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎ.గౌరీ, వి.జానకి, పి. పైడిరాజు, ఏ.లక్ష్మి, ఎస్ లీల, ఎస్. మంగ, డి. రోజా తదితరులు పాల్గొన్నారు.