ప్రజాశక్తి- మెంటాడ : మండలంలోని పెద మేడపల్లిలో శ్రీబండి మహంకాళమ్మ జాతర మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పూజా కార్యక్రమాల్లో ఆ గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు చెందిన వేలాది మంది పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు ఆలయ సంరక్షకులు బొడ్డు బుచ్చయ్య మాట్లాడుతూ భక్తుల కోర్కెలను తీర్చడంలో ప్రధాన దేవతగా బండి మహంకాలమ్మను కొలుస్తారని చెప్పారు. ప్రతి ఆది, బుధవారం ఎక్కువ మంది మొక్కులు తీర్చుకుంటారన్నారు. ఈ జాతరలో ఎంపిటిసి రెడ్డి ఎర్నాయుడు, పూడి ధనుంజరు రావు, కిలాడి సన్యాసిరావు, రెడ్డి సింహాచలం మాస్టారు, వజ్రపు బంగార్రాజు, కొవ్వాడ సన్యాసిరావు (సన్నీ), కుమరాపు ధర్మ, గ్రామ పెద్దలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.రాజాం: రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి యాత్ర మహోత్సవ వేడుకల్లో భాగంగా అమ్మవారిని తొలి రోజు ఆదివారం ఎమ్‌పి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ దర్శించుకున్నారు. ఈ మేరకు మూడు రోజులు జరుగు యాత్ర మహోత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డోలపేటలోని టిడిపి కార్యాలయంలో వారిద్దరూ కలిసి రూ. 6లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఏడుగురు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయనిది పేదల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నేటి నుంచి పోలిపల్లి అమ్మవారి జాతర భోగాపురం: మండలంలోని భోగాపురం, పోలిపల్లి గ్రామాలలో అమ్మవారి జాతరలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఈ పండగలు జరుగనున్నాయి. ఏడాదికి ఒకసారి ఈ పండగలను నిర్వహిస్తుంటారు. పోలిపల్లి గ్రామంలోని పైడితల్లి అమ్మవారి జాతరను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. ఆదివారం రాత్రి అమ్మవారి ఆలయ సమీపంలో ఉయ్యాల కంబాలు ఎత్తే కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం ఉదయం తోలేళ్ల ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. మంగళవారం పాలదార మహోత్సవాన్ని అత్యంత వైభవంగా చేయనున్నారు. చిత్ర విచిత్రమైన వేషాలతో, సాముగరడీలతో, పులి వేషాలతో పాలధార ఉత్సవముతోపాటు అమ్మవారి రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ ఇఒ వై శ్రీనివాసరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ మండల పైడిరాజు తెలిపారు. భోగాపురంలో కనకదుర్గమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ పండగను ఏటా నిర్వహిస్తుంటారు. ఈ పండగకు చుట్టుపక్క గ్రామాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటారు.150 మందితో భారీ బందోబస్తు పోలిపల్లి, భోగాపురం అమ్మవార్ల జాతర సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిఐ ఎన్‌వి ప్రభాకర్ తెలిపారు. 150 మంది సిబ్బందితోపాటు ఎనిమిది మంది ఎస్‌ఐలు, ఇద్దరు సిఐలు, ఒక ఎస్‌పిఎఫ్ పార్టీతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతరలో దొంగతనాలు జరగకుండా క్రైమ్ పార్టీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకతాయిలను అరికట్టేందుకు ఒక మప్టీ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ప్రజలు, నాయకులు, అందరూ సహకరించాలని ఆయన కోరారు.
