ప్రజాశక్తి-వేపాడ : మండలంలోని సోంపురం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గోకులం షెడ్‌ను శనివారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను టిడిపి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతోందని చెప్పారు. మండలంలో సుమారు 121 గోకులాలను మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిని ఉపయోగించుకొని పాడి రైతులు అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి లక్ష్మీనారాయణ, ఎంపిడిఒ సిహెచ్ సూర్యనారాయణ, ఎపిఒ ఆదిలక్ష్మి, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి కె.రమణమూర్తి, మాజీ ఎంపిపి దాసరి లక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.
బొబ్బిలిరూరల్ : పాడి రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం గోకులాలు నిర్మిస్తోందని ఎంపిడిఒ రవికుమార్ అన్నారు. శనివారం పారాది పంచాయతీ పరిధిలో బంకురువలస, పిరిడి గ్రామాలలో గోకులాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల శాలలు ఎక్కువగా అగ్నిప్రమాదాలకు గురవుతుండటంతో దాని నివారణకు శాశ్వత షెడ్లు ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ఎడి విష్ణు, టిడిపి రాష్ట్ర నాయకులు అల్లాడి భాస్కరరావు, ఇఒపిఆర్‌డి భాస్కరరావు, ఎపిఒ లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు.