ప్రజాశక్తి – జామి : క్వారీ పేలుళ్లతో సామాన్యుల ఇళ్లు ఛిద్రమైపోతున్నాయి. శ్లాబులు, గోడలు బీటలు వారి, పెచ్చులూడి పోతున్నాయి. అక్రమ పేలుళ్లు ఆపాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఇదెక్కడో మారుమూల ప్రాంతం అనుకుంటే పొరపాటు. మండల కేంద్రమైన జామి మేజరు పంచాయతీ పరిధిలోని మాధవరామెట్ట కాలనీలో ఇళ్లను పరిశీలిస్తే, వాస్తవమేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
జామి మేజరు పంచాయతీ పరిధిలోని మధుర గ్రామం.. మాధవరాయమెట్ట. 40 ఏళ్ల క్రితం క్వారీ పనుల నిమిత్తం వచ్చిన వలస కార్మికులతో ఏర్పడిన గ్రామం ఇది. క్వారీ పనుల కోసం పుట్టిన ఊళ్లను వదిలేసి వచ్చిన కార్మిక కుటుంబాలే అన్నీ. క్వారీల్లో పనులు చేసుకుంటూ స్థిర నివాసాలు ఏర్పర్చుకున్న వీరిలో అత్యధికులు దళిత, గిరిజన కుటుంబాలే. ఒకప్పుడు క్వారీ పనులు చేసుకుని బతికే వీరికి.. నేడు ఆ పనులు లేకుండా పోయాయి. భారీ యంత్రాలు వచ్చాక క్వారీ యజమానులు కార్మికులను పక్కన పెట్టేసిన పరిస్థితి. దీంతో విశాఖ, విజయనగరం, ఇతర పట్టణ ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వెళ్లిపోతున్న దయనీయ స్థితిలో ఉన్నారు. కానీ ఏ క్వారీల కోసం వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారో… ఆ క్వారీల్లో చేపడుతున్న బ్లాస్టింగులతో ఇళ్లన్నీ బీటలు వారి, దెబ్బతింటున్నాయి. శ్లాబులు, గోడలు పెచ్చులూడుతున్నాయి. ఏ క్షణాన కూలిపోతాయనన్న ఆందోళనలో కాలనీవాసులు ఉన్నారు. కాలనీకి అడుగుల దూరంలోనే నిత్యం బ్లాస్టింగులు, స్టోన్ క్రషర్లు భారీ శబ్దాలు చేస్తూ, దుమ్ము ధూళి వెదజల్లుతున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతుల్లేని బ్లాస్టింగులు ఆపాలని, క్రషర్లు మూసేయాలని ఎన్ని ఫిర్యాదులు చేసినా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే, అధికారులు క్వారీ యజమాని ఇస్తున్న లంచాలు తీసుకుని సమస్యను నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నిసార్లు ఫిర్యాదులు చేయాలి?
కాలనీ చుట్టూ ఉన్న అక్రమ క్వారీలను ఆపాలని, బ్లాస్టింగులు, క్రషర్లు నిలుపుదల చేయాలని 50కు పైగా వినతులు ఇచ్చాం. కానీ అధికారులు వచ్చి మా బాధలు పట్టించుకోకుండా యజమానుల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. లంచాలకు అమ్ముడుపోయి, కాలనీ వాసులకు అన్యాయం చేస్తున్నారు. – వంతల బుజ్జి, గిరిజన మహిళ
క్వారీలు, క్రషర్లే ముందున్నాయట
మా ఫిర్యాదులపై వచ్చిన కాలుష్య నివారణ అధికారులు కాలనీ కన్నా క్వారీలు, క్రషర్లు ముందు ఉన్నాయని, మీరు ఫిర్యాదులు చేస్తే చెల్లదని సెలవిస్తున్నారు. క్వారీ పేలుళ్లకు ఇళ్లన్నీ దెబ్బతిన్నాయి. మరి కొద్ది రోజులు బ్లాస్టింగులు జరిగితే, ఇళ్లు కూలిపోవడం ఖాయం.- కొర్రా నీలన్న, గిరిజన కార్మికుడు
కాలనీకి సమీపంలోనే క్వారీలు, క్రషర్లు
ప్రజల నివాసాలకు, రాష్ట్ర రహదారికి 500 మీటర్ల దూరంలో క్వారీలు, క్రషర్లు ఉండాలన్నది పర్యావరణ శాఖ నిబంధన. కానీ అధికారులు నిబంధనలు చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమ బ్లాస్టింగులు ఆపకపోతే, రానున్న కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తాం.- కె.రాజు, ఆటో కార్మికుడు
